మోర్తాడ్/భీమ్‌గల్, జనవరి 16: భీమ్‌గల్ పోలీసుస్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ఫిర్యాదులను కాకుండా సివిల్ పంచాయితీలను పరిష్కరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా పోలీసుస్టేషన్ వివాదాలకు కేంద్ర బిందువుకాగా.. తాజాగా సీఐ ఆకస్మిక బదిలీతో అభాసుపాలవుతున్నది. గడిచిన ఏడాదికాలంలో పలు వివాదాల్లో తలదూర్చిన ఇద్దరు సీఐలు బదిలీ కావడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నది. ఇక్కడ చోటుచేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో న్యాయం కోసం భీమ్‌గల్ ఠాణాకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతి ఆరోపణలెన్నో..
న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న ప్రజల నుంచి మధ్యవర్తుల ద్వారా భారీగా ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడాదిగా భీమ్‌గల్ మండలంలో ఇసుక అక్రమరవాణా జోరుగా కొనసాగింది. ఇందులో పోలీసులకు నెలవారి మామూళ్లు అందినట్లు సమాచారం. మామూళ్లు ఇవ్వని వాహనాలు పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ కేసుల కోసం ప్రత్యేకంగా మధ్య వర్తులు ఉండడం, వీరంతా పోలీస్‌స్టేషన్ సమీపంలోనే తచ్చాడుతుండడంతో పోలీస్‌స్టేషన్‌లో ఏ మేరకు పంచాయితీలు, పైరవీలు జరుగుతున్నాయో స్పష్టమవుతున్నది. భూవివాదం, హత్యలు, రోడ్డు ప్రమాదం ఇలా కేసును బట్టి చేతులు తడపాల్సిందేనని భీమ్‌గల్ మొత్తం కోడైకూస్తున్నది. కేసు పెట్టేవారైనా, కేసులో ఇరుక్కున్న వారైనా ఇరువర్గాల వారి నుంచి భారీగానే వసూలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇసుకాసురుల నుంచి కాసులు
భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని భీమ్‌గల్, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగింది. ఇసుకాసురుల నుంచి దండిగా మామూళ్లు వసూళ్లు చేసినట్లు తెలిసింది. నెలవారి మామూళ్లతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పంచాయితీదారుల నుంచి దండు కోవడం వంటి సంఘటనలతో భీమ్‌గల్ సర్కిల్ పోలీస్ వ్యవస్థ అభాసు పాలవుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై విచారణ చేయించి, పోలీసులు ప్రజల పక్షాన ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కుటుంబ తగాదాల్లోనూ తలదూర్చి..
ఇటీవల మండలంలోని చేంగల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తనను పోలీసులు వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎస్సై వ్యవహారం కూడా బయటికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరో కేసులో తన లొకేషన్‌ను సీఐ ట్రేస్ చేసి ఇవ్వడం కారణంగానే తనపై దాడి జరిగిందని భీమ్‌గల్‌కు చెందిన సత్యగంగయ్య ఏసీపీ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఐ నవీన్‌కుమార్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఏడాదిలో ఇద్దరు సీఐల బదిలీ
భీమ్‌గల్ సీఐగా పనిచేసిన ఇద్దరు ఏడాది కాలంలోనే బదిలీ కావడం గమనార్హం. భీమ్‌గల్ సీఐగా నాగపురి శ్రీనివాస్ నిర్మల్ నుంచి జనవరి 2024లో వచ్చాడు. వచ్చిన ఆరునెలల్లోనే ఇసుక వివాదంలో ఇరుక్కుని జూన్ 24న బదిలీ అయ్యారు. ఆయన తరువాత మెట్పల్లి నుంచి భీమ్‌గల్‌కు బదిలీపై సీఐగా నవీన్‌కుమార్ జూన్ 24న వచ్చారు. ఇతను బాధ్యతలు స్వీకరించిన ఆరునెలలకే జనవరి 14న బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇతడిపై భార్య, భర్తల కేసు విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి.