కంఠేశ్వర్, జూన్ 27: ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మెరుగైన విద్యా బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం విద్యాశాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గత సంవత్సరం సాధించిన ఫలితాలు అడిగి తెలుసుకున్నారు.
ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ.. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన జరిగేలా చూడాలని డీఈవో అశోక్‌ను ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సెస్సీ పాసై.. ఇంటర్లో చేరని విద్యార్థులను గుర్తించి, వారిని సంప్రదించి, కాలేజీలో చేరేలా చొరవ చూపాలన్నారు.
అన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. రెండో జత స్కూల్ యూనిఫామ్‌లు మహిళా సంఘాల సభ్యులు త్వరగా కుట్టించి ఇచ్చేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఐఈవో రవికుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు స్రవంతి, రజని, నాగోరావు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ కర్తలు పాల్గొన్నారు.