ఖలీల్వాడి, ఆగస్టు 22: చేయూత పథకం కింద బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నాచౌక్ వద్ద మహాసభ ఏర్పాటు చేయగా, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిందని తెలిపారు.
అందులో చేనేత, గీతా కార్మికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని, కానీ బీడీ కార్మికులకు కల్పించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే బీడీ కార్మికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మల్లేశ్, లింగం, వసంత, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.