డిచ్పల్లి, జూన్ 2: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షించాలని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్నివిధాలుగా సిద్ధంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్ ఎలిస్ వజ్ ఆర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్తో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్‌ను సందర్శించారు. కౌంటింగ్ హాళ్లలో టేబుళ్లు, బారీకేడ్లు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తప్పిదాలకు అవకాశం లేకుండా నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని, పోస్టల్ బ్యాలెట్ ఓటు తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను అభ్యర్థులు, వారి ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎంల ఓట్లను ఒక్కో రౌండ్ వారీగా జాగ్రత్తగా లెక్కిస్తూ ప్రతి రౌండ్‌కు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు వచ్చి సరి చేస్తారని, కౌంటింగ్ ప్రక్రియను యథావిధిగా కొనసాగించాలన్నారు. ఎలాంటి అపశృతులకు తావులేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ కల్మేశ్వర్ అన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మకరంద్, అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.