ఖలీల్‌వాడి/ కామారెడ్డి, జూలై 6: వానకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన.. కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, రాజీవ్ గాంధీ హన్మంతులతో కలిసి సమీకృత కార్యాలయాల్లోని సమావేశ మందిరంలో వైద్యారోగ్యశాఖతోపాటు పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. మలేరియా, డెంగీ, విషజ్వరాల పరిస్థితిపై ఆరా తీశారు. మూడేండ్లుగా జిల్లాలో ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాలేదని, అయితే పట్టణ ప్రాంతాల్లో ఒకింత వేగంగా విస్తరిస్తున్న డెంగీని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్యారోగ్య శాఖతోపాటు మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖలు కూడా పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సీజనల్ వ్యాధుల నివారణకు అంకితభావంతో కృషి చేయాలన్నారు.
ప్రధానంగా సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలన్నారు. డెంగీ తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన వివరాలను ప్రైవేట్ దవాఖానలు సైతం అందించేలా చూడాలన్నారు. నిజామాబాద్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ పంచాయతీరాజ్, మున్సిపల్, మహిళా శిశు, సంక్షే మం తదితర శాఖలు వైద్యారోగ్య శాఖతో సమన్వయం ఏర్పర్చుకొని డెంగీలాంటి విషజ్వరాలు ప్రబలకుండా ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు సంచాలకులు అమర్‌సింగ్, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో తరుణ్‌కుమార్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జనరల్ దవాఖాన తనిఖీ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని డయాలసిస్,ఆపరేషన్ థియేటర్,పాలియేటివ్ కేర్ సెంటర్,శస్త్ర చికిత్స వార్డు, ఎమర్జెన్సీ వార్డు,రక్త నిధి కేంద్రం,సెంట్రల్ ల్యాబ్,స్కానింగ్ తదితర వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను తెలుసుకున్నారు. ప్రైవేట్ దవాఖానకు దీటుగా వైద్య సేవలు అందించాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, దవాఖాన సూపరింటెండెంట్ లాల్‌సింగ్, దవాఖాన ఆర్ఎంవోలు శ్రీనివాస్,సుజాత ఉన్నారు.