నిజామాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన కుల గణన గణాంకాలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారంతా మండిపడుతున్నారు. దేశంలో పలు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కుల గణన వివరాలను రాజకీయ లబ్ధి కోసమే వెల్లడించారన్న విమర్శలు వస్తున్నాయి. కులగణన ఏడాది క్రితమే పూర్తైనప్పటికీ ఇన్ని రోజులు బయట పెట్టలేదు. అకస్మాత్తుగా వివరాలను ప్రకటించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బీసీ జనాభా 50శాతానికిపైగా ఉంటుందని వివిధ సంఘాలు బలంగా నమ్ముతున్నాయి. కానీ రేవంత్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల్లో అలాంటిదేమీ కనిపించలేదు. బీసీ ముస్లీంలను కలిపి 56శాతంగా పేర్కొన్నారు. బీసీల్లో అగ్రస్థానంలో ముస్లీం షేక్‌లు ఉండడంతో అవాక్కుతింటున్నారు. ముస్లిం బీసీలను తొలగిస్తే బీసీల జనాభా 46శాతమే కనిపిస్తోందని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 20శాతం దాటిన ఎస్సీ జనాభా కుల గణనలో తక్కువగా చూపారని దళిత సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కుల గణన లెక్కల్లో శాస్త్రీయత, పారదర్శకత లోపించిందన్న వాదన పెరుగుతోంది. వివరాల నమోదులో తప్పులు, సమాచార సేకరణలో కచ్చితత్వం లేకపోవడంతోనే తప్పుల తడకగా కులగణన లెక్కలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
బీసీలను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. అధికారంలోకి రావడానికి ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నోటికొచ్చిన హామీలు ఇచ్చాడు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో అడ్డగోలు హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు పాకులాడాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలను ఆదుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక హడావిడికే పరిమితం అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల అమలులో రేవంత్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారు. హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు తినాల్సి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ప్రక్రియను చేపట్టకపోవడంతో న్యాయపరంగా 42శాతం రిజర్వేషన్లు నిలబడలేదు. బీసీ డిక్లరేషన్‌లో వివిధ బీసీ ఉప కులాల వారికి అనేక హామీలు ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. వాటి అమలుకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట దక్కలేదన్న అపవాదు ఉంది. జనాభాలో మొత్తం బీసీలు 1.64కోట్ల మంది అంటే 46.25శాతంగా ప్రభుత్వం చెప్పింది. బీసీ ముస్లీంలు 35.76లక్షలు ఉంటారని వెల్లడించింది. రెండింటిని కలిపితే బీసీ జనాభా 56.33శాతంగా ప్రభుత్వం లెక్కలేసింది. దీనిపై బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాఇ. బీసీ ముస్లీంలు లేకుండా బీసీ జనాభా 51శాతానికి పైగా ఉంటుందని చెబుతున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
కుల గణన లెక్కల్లో బీసీల్లో 5 కులాలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ముదిరాజ్, మున్నూరు కాపులు, పద్మశాలి, గౌడ, యాదవ కులస్థులు రాజకీయంగా బలంగా ఉన్నట్లుగా పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ వీరంతా బలమైన శక్తిగా ఎదిగారని అందులో పొందుపర్చారు. ఈ ఐదు కులాల జనాభాకు తగ్గట్లుగా అవకాశాలను అందిపుచ్చుకున్నారని నివేదికలో పేర్కొనడంపై ఆ వర్గాల్లో అసంతృప్తిని పెంచుతోంది. రేవంత్ ప్రభుత్వం వెల్లడించిన కుల గణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా వెనుకబడి ఉండగా ఆ తర్వాత ఎస్టీలు, బీసీలు ఉన్నారని పేర్కొంది. బీసీల్లో అత్యధికంగా లబ్ధిపొందుతున్నది కేవలం ఐదు కులాలేనని సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపులు జనాభాతో పాటుగా రాజకీయంగా బలంగా ఉన్నట్లుగా తెలిపింది. బీసీ-ఈ లో షేక్‌లు అత్యధికంగా ఉన్నారని వివరించింది. గౌడ, పద్మశాలి, కురుమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారని నివేదిక తేటతెల్లం చేసింది. షేక్‌లు, ముదిరాజ్, యాదవ, గౌడ్, మున్నూరు కాపులో బీసీ జనాభాలో 30శాతం ఉన్నారని తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 242 కులాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అందులో బీసీల్లో 133 కులాలు ఉండగా ఇందులో 69 కలాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, 64 కులాల్లో తక్కువ వెనుకబాటుతనం ఉందని తేల్చింది. ఎస్సీలో 59 కులాలు ఉండగా ఇందులో 41 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్లుగా పేర్కొంది. ఎస్టీల్లో 32 కులాలు ఉండగా 25 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపింది.
మోర్తాడ్, ఏప్రిల్ 16: కులగణన విషయంలో రాత్రుల్లో దొంగలెక్కలిచ్చినట్లున్నది. బీసీలు తక్కువగా ఉన్నట్లు చూపడం విడ్డూరం. బీసీలను నమ్మించి నయవంచన చేసింది కాంగ్రెస్. అనేక విషయాల్లో బీసీలను నమ్మించి మోసం చేస్తుంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. బీసీలను అణగదొక్కడానికే కాకిలెక్కలు చెప్పినట్లుగా ఉన్నది. బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి అణగదొక్కాలనే చూస్తున్నది, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు గుణపాఠం చెప్పాల్సిందే.
– పర్సదేవన్న, దోన్పాల్
50శాతానికి పైగా ఉన్నటు వంటి బీసీలను కేవలం 46శాతమేనని చూప డం కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసమే. బీసీ డిక్లరేషన్ సభ పెట్టడం, అందులో చెప్పినవి చేయకపోవడం, ఇప్పుడు బీసీల లెక్కలు తప్పుగా చూపడం, చాలా బీసీకులాలకు మోసం చేయాలని చూడడం, ఇది కచ్చితంగా కుట్రపూరితమే. బీసీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి బీసీలు తప్పకుండా సమాధానమిస్తారు.
– రేగుంట దేవేందర్, ఉప్లూర్
బోధన్, ఏప్రిల్ 16: కుల గణన సర్వే నివేదికలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది. ము స్లింలను మినహాయిస్తే రాష్ట్రంలో బీసీల జనాభా 51 శాతానికి పైగా ఉంటుందని మొదటి నుంచీ బీసీ కులాలు చెబుతూ వచ్చాయి. మున్నూరు కాపుల జనాభాను తక్కువగా చూపడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది.
– బీర్కూర్ శంకర్ (బుజ్జి) బోధన్ పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు