వినాయక నగర్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు . శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన వల్ల రానున్న కాలంలో బీసీల (BCs) భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కులగణనపై తమతో చర్చకు వస్తామని కాంగ్రెస్ చెప్పడం హాస్యస్పదంగా ఉందని పేర్కొన్నారు. తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, దానికి ముందు వారు ఇచ్చిన వాగ్దానాలు (Promises) నెరవేర్చిన అనంతరం తమతో చర్చలకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాక ముందు వంద రోజుల్లో వాగ్దానాలు పూరి చేస్తామని మాటిచ్చిన కాంగ్రెస్, 400 రోజులు గడుస్తున్న వారిచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కంటున్న కలలు నీరుగారి పోతున్నాయని, దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది గాడిద గుడ్డేనని విమర్శించారు. అందుకు ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమని కేంద్రమంత్రి అన్నారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.ఈ సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.