నిజామాబాద్, అక్టోబర్ 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీ రిజర్వేషన్లు అమలులో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని బీసీ ప్రజలంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఇందులో భాగంగా జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన మరునాడే నిజామాబాద్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం వైఫల్యం చెందిన నేపథ్యంలో బీసీల్లో ఆగ్రహావేశాలు రగులుకున్నాయి. గురువారం హైకోర్టు పరిణామాల నేపథ్యంలో కోపోద్రిక్తులవుతున్నారు. బీసీలకు న్యాయం చేయలేకపోయిన కాంగ్రెస్ సర్కారుకు బీసీల నుంచి నిరసన వ్యక్తం అవుతుందేమోనన్న ఆందోళన పట్టుకుంది. ఇందులో భాగంగానే పోలీసులను నిఘా సంస్థలు అప్రమత్తం చేయగా శుక్రవారం ఉదయం నుంచే బీసీ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలను నిజామాబాద్ నగరంలో అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. గడిచిన నెల రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రెండు పర్యాయాలు వచ్చారు. ఈ రెండు టూర్లలోనూ ఎక్కడికక్కడ నిర్భంధకాండ అమలైంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ సర్కారు మాటిచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని జీవో రూపంలో అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి పూనుకున్నారు. తద్వార రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేయించారు. నోటఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించగా హైకోర్టులో ప్రతికూలత ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ సర్కారు ద్వంద నీతిపై ప్రజలంతా మండిపడుతున్నారు. ఎన్నికల్లో 42శాతం వాటా అందిస్తానంటూ చెప్పుకుంటూ వచ్చినప్పటికీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు గట్టిగా వినిపించడంలో వైఫల్యత కనిపించింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లినట్లుగా కాంగ్రెస్ చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో నమ్మకం ఏర్పడలేదు. రేవంత్ రెడ్డి సర్కారు చేస్తోన్న ఈ తంతును ముందు నుంచే గమనిస్తూనే బీసీ ప్రజలంతా అపనమ్మకంతోనే ఉన్నారు. కాంగ్రెస్ లేనిపోని హడావిడి సృష్టించి బీసీలను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. చిత్తశుద్ధిని నిలుపుకోవడంలో వెనుకబడింది. హైకోర్టు విధించిన స్టేతో ఎక్కడికక్కడ నిలిచిన స్థానిక ఎన్నికల ప్రక్రియతో కాంగ్రెస్ పార్టీ తీరు తేటతెల్లమైంది. బీసీలంతా ముక్తకంఠంతో హస్తం పార్టీ మోసాన్ని ఎండగడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీతల భయం పట్టుకుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల్లో పోలీసులు తీసుకుంటున్న అతి జాగ్రత్తలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సెప్టెంబర్ 4న కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు సీఎం వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, వామపక్ష పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వరద బాధితులను సైతం సీఎంను నేరుగా కలిసి కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించలేదు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పలువురు నేతలను హౌస్ అరెస్టులు చేసి నిర్భంధించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం టూర్ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓదార్చేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని ఎవ్వరూ అడ్డుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఆంక్షలు విధించడంపై ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలను, బీసీ సంఘాల ప్రతినిధులను ఉదయమే నిర్భంధంలోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించడం సరికాదంటూ ప్రజలు వాపోయారు. ప్రజాపాలన అంటే ఇదేనా? అని అడుగుతున్నారు. సమీకృత కలెక్టరేట్ నుంచి బోర్గాం(పి) శివారులోని ఫంక్షన్ హాల్ వరకు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా వంద మీటర్లకు ఒకరిద్దరు కానిస్టేబుళ్లు, మఫ్టీలోనూ గస్తీ పోలీసులతో దారిపొడవునా నిఘా పెట్టారు.
మోర్తాడ్, అక్టోబర్ 10: రిజర్వేషన్లు అంటూ బీసీలను మోసం చేస్తున్నారు. 42శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ కాంగ్రెస్ బీసీల ఓట్ల కోసం రాజకీయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిపోయింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 22 నెలలవుతున్నా బీసీల గురించి ఇప్పటివరకూ పట్టించుకోలేదు. రాజ్యాంగ సవరణ చేయాలని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ ప్రకటన చేయడం మోసం చేయడమే. ప్రకటనలు ఇచ్చే ముందు ఆరు గ్యారెంటీల్లాగా కాకుండా చూసుకోవాలి. బీసీలను రిజర్వేషన్ పేరిట మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనుకోవడం దారుణం.
-ఎనుగందుల అశోక్, పాలెం, మోర్తాడ్ మండలం
కాంగ్రెస్ పార్టీ బీసీలపై కపటప్రేమ చూపిస్తున్నది. రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఇస్తున్నట్లు నమ్మించి మోసం చేస్తున్నది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసే ముందు తెలియదా, ఏ విధంగా రిజర్వేషన్లను తీసుకురావాలో. జీవో జారీ చేయడం..వాళ్లే కేసులు వేయించడం ఇది బీసీలను మోసం చేయడమే. ఇంకెన్ని రోజులు బీసీలతో రాజకీయ క్రీడ కొనసాగిస్తారు. బీసీలకు రిజర్వేషన్ అనే ఆశ చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం మానుకుని, న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమిస్తాం.
– పర్స దేవన్న, దోన్పాల్, మోర్తాడ్ మండలం
బీసీ రిజర్వేషన్ పేరిట డ్రామాలు చేయడం మానుకోవాలి. రాజ్యాంగ సవరణ లేకుండా, అసెంబ్లీ తీర్మానంతో బీసీ బిల్లు రాదని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు డ్రామాను మొదలు పెట్టింది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లు కావస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీ రిజర్వేషన్ అంటూ డ్రామాను మొదలు పెట్టడం బీసీలతో ఆడుకోవడమే. రిజర్వేషన్ పేరిట బీసీలను ఆగం చేయడం, రాజకీయంగా లబ్ధిపొందాలని చూడడం, ఇదంతా ప్రస్తుతం బీసీలు గమనిస్తున్నారన్న సంగతిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా పనిచేయాలి.
– రేగుంట దేవేందర్, ఉప్లూర్, కమ్మర్పల్లి మండలం
బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. కానీ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీలంతా ఏకమై పోరాటం చేయాల్సిందే. రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవడం శోచనీయం. రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణతో తీసుకురావాలని తెలిసినా అసెంబ్లీ తీర్మానం అని, చివరికి న్యాయస్థానాల వద్ద చేతులెత్తేయడం బీసీలను మోసం చేయడమే. రిజర్వేషన్ల కోసం బీసీలు ఇప్పటివరకు ఓపికగా ఎదురుచూశారు. కానీ కాంగ్రెస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ ప్రకటన చేసింది. బీసీలందరూ ఇప్పటికైనా మేల్కొని రిజర్వేషన్ల సాధనకు కృషి చేయాలి.
– కొత్తపల్లి రఘు, కమ్మర్పల్లి