కామారెడ్డి, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.2 శాతమే ఉన్నట్లు చెబుతుండడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో అన్యా యం చేసేందుకు, ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ విధంగా తప్పుడు లెక్కలు చెబుతున్నదని బీసీ వర్గా లు మండిపడుతున్నాయి. మరోవైపు, బీసీల సంఖ్య కావాలనే తక్కువగా చూపించారని సొంత పార్టీ నుంచే రేవంత్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీ కుల గణన చేపట్టడంతో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఊదరగొట్టింది. ఆ పార్టీ అగ్ర నేతలు సైతం బీసీల పాట పాడారు. వెనుకబడిన వర్గాలకు పూర్తిగా ప్రయోజనాలు దక్కేలా చేస్తామని ఎన్నికల సభల్లో ప్రకటించారు. కామారెడ్డి వేదికగా జరిగిన కాంగ్రెస్ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు, కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు, జ్యోతీ బాపూలే పేరుతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, బీసీ సంక్షేమానికి ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల కేటాయింపు, ప్రత్యేకంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖ, ప్రతి మండలంలో బీసీ గురుకులాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక భవనాలు, ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్.. ఇలా ఎన్నో వరాలు కురిపించారు. మున్నూరుకాపులకు, ముదిరాజ్‌లకు, పద్మశాలీలకు, విశ్మకర్మలకు రకరకాల హామీలు ఇచ్చారు. తీరా అమలు చేయకుండా ‘చేయి’చ్చారు.
బీసీ కులగణన కోసం సర్వే ప్రారంభమైనప్పటి నుంచే ఉమ్మడి జిల్లాలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించాల్సి ఉండగా, ఎన్యుమరేటర్లు అన్ని ఇండ్లకు వెళ్లలేదని తెలిసింది. మా ఇంటికి రాలేదని అప్పట్లోనే ఎంతో మంది చెప్పడం సర్వే ప్రామాణికతపై ప్రశ్నలు రేకెత్తించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ప్రకటించిన బీసీ కుల గణన నివేదిక వివరాలు అనేక సందేహాలకు తావిచ్చాయి.
రాష్ట్రంలో తక్కువగా ఉండే అగ్రకులాల జనాభా పెరిగినట్లు చూపడం, ఎక్కువగా ఉండే బీసీల సంఖ్య తగ్గినట్లు చూపడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్రపూరితంగానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జనాభా తగ్గించి చూపిస్తున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నాయి. 50శాతం వాటాగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికి ఇస్తామని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊదరగొట్టారు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వెల్లడించిన బీసీల కుల గణన వివరాలే అందుకు తార్కా ణం. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. కాంగ్రెస్‌కు బీసీల మీద ప్రేమ లేదు. మాటల్లోనే బీసీల జపం చేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాలకు టికెట్లు ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ. బీసీలను ఉద్ధరిస్తున్నామని మాయమాటలు చెప్పి, ఎమ్మెల్సీ టిక్కెట్లు మాత్రం రెడ్లకు ఇవ్వడంలోనే బీసీల పట్ల వారి నిబద్ధత ఏమిటో అర్థమవుతున్నది.
-నీల నాగరాజు, బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రంలో బీసీ కుల గణనను సంపూర్ణంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం నామమాత్రంగా సర్వే చేసి సర్కారు చేతులు దులుపుకొన్నది. ఇవాళ ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పుల తడకే. తక్కువ జనాభా ఉండే అగ్రవర్ణాల సంఖ్య పెరిగినప్పుడు, ఎక్కువగా ఉండే బీసీల జనాభా ఎలా తగ్గుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా కుల గణన చేపట్టాలి. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి.
-చెలిమల భానుప్రసాద్, బీఆర్ఎస్ యూత్ టౌన్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలను చిన్నచూపు చూస్తున్నది. కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసంగించేందుకు యత్నిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న వక్రబుద్ధితో కుల గణన చేపట్టింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్వే ఆధారంగా కుల గణనలో వచ్చిన లెక్కల ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలి.
-బల్వంత్‌రావు, బీఆర్ఎస్ నేత
రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ కాదు.. రెడ్ల కాంగ్రెస్. పదవులు, టికెట్లు అగ్రవర్ణాలకే ఇస్తున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణలో 136 బీసీ కులాలు ఉన్నాయి. కానీ తాజా లెక్కల్లో మాత్రం తక్కువ జనాభా ఉన్నట్లు చూపడం వెనుక కుట్ర దాగి ఉన్నది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నాయి. వెనుకబడిన వర్గాలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
-సాప శివరాములు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన మొత్తం అసంపూర్తిగా ఉంది. సర్వే మొదలైనప్పటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. కుల గణన సందర్భంగా కొన్ని ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తే, మరి కొన్ని ఇండ్లకు అసలు వెళ్లనే లేదు. ఏదో హడావుడిగా సర్వే ముగించి బీసీల సంఖ్య తక్కువగా ఉందని చూపడం కుట్రే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. కుల గణన విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా ఉండాలి.
-గెరిగంటి లక్ష్మీనారాయణ, బీసీ నాయకుడు