మోర్తాడ్/బాల్కొండ/ వేల్పూర్, సెప్టెంబర్ 5: భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టంపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు. భారీ వర్షాలతో నియోజకవర్గంలో దెబ్బ తిన్న రోడ్లను వేముల గురువారం పరిశీలించారు.
అమీర్‌నగర్-కోనాసముందర్ రోడ్డు, అంక్సాపూర్-పోచంపల్లి రోడ్డుతో పాటు రామన్నపేట్-వేల్పూర్ మధ్య కొట్టుకుపోయిన కల్వర్టును చూశారు. అనంతరం బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నియోజకవర్గంలో పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అన్ని చెరువులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెరువులను పర్యవేక్షించాలని సూచించారు.
మెండోరా మండలం బుస్సాపూర్‌లో సుమారు 40 ఎకరాల్లో పల్లి, వేల్పూర్ మండలం మోతెలో 10 ఎకరాల్లో వరి, పచ్చలనడ్కుడ గ్రామంలో ఐదెకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు తెలుపగా, అన్ని వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఎమ్మెల్యే సూచించారు. పంటలు చేతికొచ్చే సమయం కావున మళ్లీ వర్షాలు కురిస్తే నష్టం మరింత పెరిగే అవకాశమున్నదని, రైతులు జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో నియోజకవర్గంలో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరాగా, మోర్తాడ్‌లోని మొండి వాగులో గల్లంతై చనిపోయిన కామారెడ్డికి చెందిన రైతు కూలీ వివరాలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల తెలిపారు. కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్‌అండ్‌బీకి సంబంధించి రామన్నపేట్-వేల్పూర్ మధ్య కల్వర్టు, కమ్మర్పల్లి-ఉప్లూర్ మధ్య కల్వర్టు, పడగల్ గ్రామసమీపంలో రాకపోకలు స్తంభించిన ప్రాంతాన్ని బాగు చేయించాలని ఆర్అండ్బీ మంత్రిని కోరుతామన్నారు. అమీర్‌నగర్-కోనాసముందర్ రోడ్డు, అంక్సాపూర్-పోచంపల్లి మధ్య రోడ్డును బాగు చేయించాలని పంచాయతీరాజ్ మంత్రికి విన్నవిస్తామన్నారు.
సంబంధిత మంత్రులకు నివేదికలు పంపి ఫ్లడ్ డ్యామేజ్ పనులు చేపట్టేలా చూస్తామన్నారు. తెగిపోయిన చెరువులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, చెరువులు తెగే పరిస్థితిలో ఉంటే వాటిని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆర్డీవో రాజాగౌడ్, ఏడీఏ శ్రీనివాసరాజు, తహసీల్దార్లు, ఇరిగేషన్ డీఈ సురేశ్, ఏఈలు, ఎంపీడీవో రాజశ్రీనివాస్, కమ్మర్పల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, చిన్నారెడ్డి, ప్రకాశ్, గంగాధర్, రాజు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.