ఏర్గట్ల/ భీమ్‌గల్, అక్టోబర్ 25 : కేసీఆర్ పాలనలో తాను మంత్రిగా చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే గ్రామాల్లో దర్శనమిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఏర్గట్ల, భీమ్‌గల్ మంలాల్లో పర్యటించారు. ఏర్గట్లలో షాదీఖాన, తాళ్లరాంపూర్, దోంచందలో పంచాయతీ భవనాలనుప్రారంభించారు. భీమ్‌గల్ మండల కేంద్రంతోపాటు మండలంలోని సంతోష్‌నగర్, సుదర్శన్‌నగర్ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాను నిధులు మంజూరు చేసి వీడీసీ, పార్టీ నాయకులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసినట్లు తెలిపారు.
ప్రొసీడింగ్ కాపీలు అప్పటి ప్రభుత్వ జీవో ద్వారా వచ్చాయని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను రద్దుచేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. తాను మంజూరు చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి తన ఖాతాల్లో వేసుకోవాలని చూస్తోందన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వానికి పేరు వచ్చినా పర్వలేదని, కానీ అభివృద్ధి పనులను మాత్రం ఆపవద్దని కోరారు.
ఏర్గట్ల నుంచి మెట్‌పల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న తీగల వాగు బ్రిడ్జి, తాళ్ల రాంపూర్ నుంచి కొండాపూర్, దోంచంద నుంచి తడ్పాకల్కు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలన్నారు.భీమ్‌గల్‌లో రూ.50 లక్షలతో బంజారా భవనంకేసీఆర్ హయాంలోనే తండాలకు మహర్దశ వచ్చిందని వేముల తెలిపారు. కేసీఆర్ సహకారంతో భీమ్‌గల్ మండలంలోని సుదర్శన్‌నగర్, సంతోష్‌నగర్ తండాలను నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గానికి ఒక బంజారా భవనం కావాలన్న బంజారాల కోరిక మేరకు కేసీఆర్ సహకారంతో రూ. 50 లక్షలతో భీమ్‌గల్‌లో బంజారా భవన నిర్మాణ పనులు పూర్తిచేశామన్నారు. ఈ భవనానికి ప్రహరీ నిర్మాణానికి సీడీపీ నిధుల నుంచి రూ.17 లక్షలు మంజూరు చేసి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, మాజీ ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు జైనుద్దీ న్ తదితరులు పాల్గొన్నారు.