ఖలీల్వాడి, మే 11: బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని.. కేంద్ర మంత్రి కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ప్రదర్శిస్తున్న వైఖరే అందుకు నిదర్శనమని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాలికపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని, దీని వెనుక రాజకీయ కారణాలున్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్య యువకుడిపై ఇదే ఆరోపణలు వచ్చి ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే వారా? అధికార పార్టీల నేతల కుటుంబాలకు ఒక చట్టం.. సాధారణ ప్రజలకు మరో చట్టమా? అని ప్రశ్నించారు.
‘బేటీ బచావో’ అంటూ దేశానికి ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ నాయకత్వం.. ఇప్పుడు తమ పార్టీ నేత కుటుంబానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యవహారంలో ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నదో ఉందో సమాధానం చెప్పాలని నిలదీశారు. మహిళల భద్రతపై ప్రతిరోజూ ప్రకటనలు చేసే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో ఎందుకు మూగబోయిందో చెప్పాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. బాధిత కుటుంబం తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొంటున్నదనే వార్తలు వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడం మరింత దారుణమని, కేసును బలహీనపర్చేలా తేలికపాటి సెక్షన్లు నమోదు చేయడం, విచారణలో జాప్యం చేయడం అనుమానాలకు దారి తీస్తున్నదన్నారు. మరోవైపు కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ప్రత్యర్థి నాయకుల కుటుంబాలపై వ్యక్తిగత దూషణలకు దిగడం ద్వారా అత్యంత నీచ రాజకీయ సంస్కృతికి తెర లేపారన్నారు.
ప్రజా జీవితంలోని నాయకులు సంస్కారం, బాధ్యతతో వ్యవహరించాలి గానీ రాజకీయ విభేదాలను కుటుంబాల వరకు తీసుకెళ్లడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఇలాంటి వారు బీసీలమని బీసీ కార్డును, మున్నూరుకాపులమం టూ కులం కార్డును వాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంత మంది ఆడపిల్లల ఉసురుపోసుకోమని ఏ కులం, ఏ మతం చెప్పదని తెలిపారు. ఈ వ్యవహారం లో సీఎం స్పష్టమైన వైఖరి ప్రకటించక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని, బీజేపీ నాయకత్వంతో ఉన్న అంతర్గత అవగాహనతో ఈ కేసులో చర్యలు నిలిచిపోయాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నా రు. నిందితుడిని అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.