నిజామాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చిల్లర బుద్ధి మానుకోకపోతే జిల్లా ప్రజలే ఉరికించి కొడతారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజల చేతిలో చెప్పుదెబ్బలు తినే రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను వెంటేసుకొని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంగళవారం మాధవనగర్ ఆర్వోబీ వద్ద చేసిన హంగామాను బాజిరెడ్డి తప్పుబట్టారు. బుధవారం నిజామాబాద్ రూరల్ మండలంలో పర్యటించిన ఆయన అర్వింద్‌పై నిప్పులు చెరిగారు.
మాధవనగర్ పైవంతెన నిర్మాణంలో కేంద్రం వాటా కేవలం రూ.30 కోట్లేనని, తెలంగాణ ప్రభుత్వం రూ.63 కోట్లు వెచ్చించి ఆర్వోబీని నిర్మిస్తోందని వివరించారు. వాస్తవాలు తెలిసి కూడా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా బీజేపీ ఎంపీలు మాట్లాడడం వారి నైతికతను తెలియజేస్తోందన్నారు. బీజేపీ నానాటికీ సిగ్గుమాలిన రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్లే ముఖం లేక అబద్ధాలతో నమ్మించాలని చూడడం సరికాదన్నారు. నిజామాబాద్ ఎంపీగా గతంలో అనేక మంది పని చేసిన వారున్నారని, అందులో అత్యంత దరిద్రమైన వ్యక్తి ఇప్పుడు ఎంపీగా పని చేస్తున్నాడంటూ అర్వింద్‌ను ఉద్దేశించి విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
పసుపు బోర్డు ఏది..?
2019 ఎన్నికల్లో పసుపుబోర్డు తెస్తానంటూ ప్రజలను, రైతులను నమ్మించిన బీజేపీ, ఆ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్.. ఇచ్చిన హామీని పక్కకు పడేసి ప్రజలను మోసం చేసిన దగాకోరులని బాజిరెడ్డి అభివర్ణించారు. పసుపుబోర్డు తీసుకు రాకపోతే ఐదు రోజుల్లోనే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన అర్వింద్‌కు నిజామాబాద్ జిల్లాలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు. అడుగడుగునా ప్రజలంతా అడ్డుకుంటున్నప్పటికీ సిగ్గు లేకుండా తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మాధవనగర్ బ్రిడ్జికి ఏం సంబంధం ఉందో అర్వింద్ చెప్పాలని నిలదీశారు.
రైల్వే మంత్రి కాదు, ఆర్వోబీకి నిధులు తెచ్చిన వ్యక్తి కాదని చెప్పారు. మాధవనగర్ బ్రిడ్జి నిర్మాణం కోసం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రూ.63 కోట్లు విడుదల చేయించారన్నారు. ఆర్వోబీలో ఇప్పటివరకు రైల్వే శాఖ ద్వారా చేపట్టాల్సిన పనులే మొదలు కాలేదన్నారు. దానిపై వివరణ ఇవ్వాల్సిన ఎంపీ.. అందుకు భిన్నంగా ఫొటోలకు ఫోజులు కొడుతూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. తాము నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులమని, అర్వింద్‌లా ఫోజులు కొట్టాలంటే తమకు సమయమే సరిపోదంటూ చురకలంటించారు. అభివృద్ధిని నమ్ముకొని పని చేస్తున్నందునే ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని, త్వరలోనే బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని బాజిరెడ్డి అన్నారు.