నస్రుల్లాబాద్/రుద్రూర్/కోటగిరి, ఏప్రిల్ 21: వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని రూరల్ మాజీ ఎమ్మెలే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నస్రుల్లాబాద్, రుద్రూర్ మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు.
రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించాలని నాయకులకు సూచించారు. సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సమావేశాల్లో బాన్సువాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జుబేర్, నాయకులు గణేశ్, నర్సింహులు గౌడ్,సాయిలు,అఫ్రోజ్, పోశెట్టి, లక్ష్మణ్, షఫి, శంకర్, మధు, డౌర్ సాయిలు, ఎంజీ గంగారాం, జువ్వల తదితరులు పాల్గొన్నారు.
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని బాజిరెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కేశాడన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో ఎంపీపీ మోరే సులోచన కిషన్‌ను పరామర్శించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి, మోసం చేసిన రేవంత్ సర్కారుకు రాబోవు రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ప్రజలు చాలా తెలివిగల వారని, అన్నీ గమనిస్తున్నారని అన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారం ఎటుంటే అటువైపు ఉంటాడని విమర్శించారు. రాబోవు రోజుల్లో బాన్సువాడలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. బాజిరెడ్డి వెంట మాజీ ఎంపీపీ మోరే సులోచన కిషన్, ఎత్తొండ మాజీ ఉప సర్పంచ్ సుజాత దేవేందర్, మాజీ ఎంపీటీసీ ఫారుక్, మండల నాయకులు ఉన్నారు.
కామారెడ్డి/బీబీపేట(దోమకొండ), ఏప్రిల్ 21 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాకేంద్రంతోపాటు దోమకొండలో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నిర్వహించనున్న రజతోత్సవ సభకు ప్రతి కార్యకర్త హాజరుకావాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలి, కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేతకాక ప్రతిపక్షాలపై నోరుపారేసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ. 2 లక్షల వరకు వందశాతం రైతులకు రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో సంతోషంగా ఉన్న ప్రజలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రజా సంక్షేమ పథకాల అమలులో మాజీ సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని విమర్శించారు. నియోజకవర్గం నుంచి మూడు వేల మంది కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశాల్లో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు, బలవంత్‌రావు, గండ్ర మధుసూదన్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గోపీగౌడ్, కే.శేఖర్, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్,వైస్ చైర్మన్ రమేశ్, పార్టీ నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, గూడెం బాల్‌రాజ్, కమలాకర్ రావు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.