బాన్సువాడ, సెప్టెంబర్ 2: బాన్సువాడలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గర్భిణికి సిజేరియన్ చేస్తుండగా శిశువు మృతి చెందింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత వర్నికి చెందిన అంజయ్య భార్య సోనీ నిండు గర్భిణి. మూడ్రోజుల క్రితం ఆమెను మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తీసుకురాగా, సాధారణ ప్రసవం కోసమని వేచి చూద్దామని వైద్యులు చెప్పారు.
రెండు రోజులు గడిచినా డెలివరీ కాకపోవడంతో సిజేరియన్ చేయాలని కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం వైద్యులను కోరారు. డాక్టర్లు సాయంత్రం వేళ సిజేరియన్ చేయగా, మగ శిశువు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ మరణించాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంత మొత్తుకుంటున్నా సిజేరియన్ చేయలేదని, పొద్దున్నే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికేవాడని అంజయ్య వాపోయాడు.
ఈ ఘటనపై సూపరింటెండెంట్ విజ యలక్ష్మిని వివరణ కోరగా, గర్భిణి ఆరోగ్యంగా ఉందని, నార్మల్ డెలివరీ కోసం సోమవారం ఉదయం మందులు ఇచ్చామన్నారు. సోనీ పరిస్థితి చూసి సాయంత్రం సిజేరియన్ చేయగా, అప్పటికే శిశువు ఉమ్మి మింగి చనిపోయాడని వివరించారు. దవాఖానలో ముగ్గురు గైనకాలజిస్టులు ఉండగా, ఒకరు ఇటీవలే రిజైన్ చేశారన్నారు. మిగిలిన ఇద్దరు డ్యూటీలో ఉన్నారని తెలిపారు.