కంఠేశ్వర్, మే 2: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. మండుటెండలతో జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నారు. వడదెబ్బ నివారణపై వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలపాలని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
వాతావరణ మార్పుల ప్రభావంతో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయిన, ఈ క్రమంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మధ్యాహ్న సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలకు ఎండ తగలకుండా టోపీ లేదా టవల్‌ను వినియోగించాలన్నారు. ఎండ సమయాల్లో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, నీడ ప్రదేశాలలోనే ఉండాలని సూచించారు. ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోవడంతో పాటు తేలికపాటి కాటన్ వస్ర్తాలను ధరించాలన్నారు.
త్వరగా వడదెబ్బకు లోనయ్యే స్వభావం కలిగిన వారు విధిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలలో పని చేసే ఉద్యోగులు, కార్మికులు వడదెబ్బకు లోను కాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉపాధిహామీ కార్మికులు ఉదయం వేళలోనే పనులు చేసేలా, పని ప్రదేశాలలో తప్పనిసరిగా షామియానాలు, తాగునీటి వసతి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అన్ని దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ నివారణ ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.