Nizamabad | నిజామాబాద్ ఖలీల్ వాడీ : సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటని డాక్టర్ గ్రీష్మిక అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ దవఖానలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని అన్నారు. 30 సంవత్సరాల పై బడిన వయస్సు ఉన్న ప్రతీ మహిళ క్రమం తప్పకుండా పాప్ స్మియర్ టెస్ట్, హెచ్‌పీవీ స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
అసురక్షిత లైంగిక సంబంధాలు, హెచ్‌పీవీ వైరస్ సంక్రమణ, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, పొగతాగడం వంటి కారణాల వల్ల సెర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవగాహనే సెర్వికల్ క్యాన్సర్‌పై ప్రధాన ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ సెంటర్ హెడ్ కె. స్వామి, డీఎంఎస్ డాక్టర్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.