ఖలీల్‌వాడీ, మార్చి 15: ఆటో డ్రైవర్ స్వామి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం ఖిల్లా కెనాల్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ స్వామి తన ఆటో సరిగ్గా నడవడం లేదని తీవ్ర మనస్తాపానికి గురై భార్యను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దంపతులిద్దరు తనువుచాలించగా ఒక్కగానొక్క కొడుకు ఒంటిరివాడయ్యాడు. ఈ మేరకు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా స్వామి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు.
మల్లికార్జున్‌కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా.. ఎవరికి నష్టం జరుగుతుందనే ఆలోచన చేయలేదన్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై ఆటో డ్రైవర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రోజుకోచోట ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్ స్వామి కుటుంబానికి వెంటనే 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆటోడ్రైవర్లకు ప్రతి నెలా రూ.10 వేల నుంచి 15 వేల వరకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత బస్సు స్కీం తీసుకువచ్చి ఆటోడ్రైవర్ల గురించి ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభు త్వం ఆలోచన చేయాలని, స్వామి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బిగాల వెంట బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, సూదం రవిచందర్, సుజిత్‌సింగ్, సత్యప్రకాశ్, దారం సాయిలు, నవీన్, విక్రమ్‌గౌడ్, సాయి, రామడ్గు బాలకిషన్, రంగు, సీతారాం, సదానంద్, రవిచందర్ ఉన్నారు.