మాక్లూర్(నందిపేట్), మార్చి 3 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు పథకం.. ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. గిరాకీ తగ్గడంతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పులపాలయ్యారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ (37) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ తగ్గింది. దీంతో మోహన్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. చేసిన అప్పులు తీర్చడానికి ఐదు నెలల క్రితం దుబాయి వెళ్లి అక్కడ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఫిబ్రవరి 23న జరిగిన కారు ప్రమాదంలో మోహన్ మృతి చెందాడు. మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకోగా.. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు గుమ్ముల నరేంద్ర, మోహన్, ఆటో యూనియన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.