మోర్తాడ్, డిసెంబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని గ్రామాల్లో వీడీసీలు అపహాస్యం చేస్తున్నాయి. గ్రామాల్లో వీడీసీల ఇష్టారాజ్యం కొనసాగుతుండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలవాల్సిన సర్పంచ్ అభ్యర్థులు వేలం పాడి పదవులను దక్కించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీడీసీల ప్రోత్సాహంతో కొనసాగుతున్న ఈ వేలం పాటలకు అధికారులు కళ్లెం వేయకపోవడంతో గ్రామ కమిటీలకు తాము ఆడిందే ఆటగా మారింది. ప్రజల ఓట్లను కూడా కొల్లగొట్టేస్థాయికి చేరుకున్నా, అధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం గమనార్హం. సర్పంచ్ పదవులకు లక్షల్లో వేలం నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి వేలం నిర్వహిస్తే చట్టరీత్యా నేరమంటూ ఊదరగొడుతున్నారే తప్ప చర్యలకు మాత్రం ఉపక్రమించకపోవడం విడ్డూరం. వీడీసీల కారణంగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నామన్న అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
బాల్కొండ నియోజకవర్గంలో జోరుగా వేలం పాటలు
నియోజకవర్గంలోని మోర్తాడ్‌లో ఇప్పటికే మూడు గ్రామాల్లో వేలం నిర్వహించగా, కమ్మర్పల్లి, వేల్పూర్, ఏర్గట్ల మండలాల్లో సైతం సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించినట్లు తెలిసింది. వేల్పూర్ మండలంలోని ఓ గ్రామంలో రూ.26లక్షలకు సర్పంచ్ పదవికి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కమ్మర్పల్లి మండలంలోని ఒక గ్రామపంచాయతీకి రూ.3.20 లక్షలకు, ఏర్గట్ల మండలంలోని గ్రామకమిటీలు సర్పంచ్ నుంచి వార్డుసభ్యుల పదవుల వరకు వేలం నిర్వహించినట్లు తెలిసింది.
మరో గ్రామంలో సర్పంచ్‌కు రూ.24 లక్షలు, ఉపసర్పంచ్‌కు రూ.2లక్షలు, వార్డుసభ్యులకు రూ.10వేలు ఆపైనా, ఇంకో గ్రామంలో సర్పంచ్‌కు రూ.20.20లక్షలు, ఉపసర్పంచ్‌కు రూ.2లక్షలకు పైగా, వార్డుసభ్యులకు రూ.10వేల నుంచి పోటీని బట్టి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను పక్కదారి పట్టించి, వేలం నిర్వహిస్తే భవిష్యత్తులో సర్పంచులు, ఉపసర్పంచుల పదవులను సైతం గ్రామకమిటీలు శాసిస్తాయనడంలోఎలాంటి అనుమానంలేకపోలేదు. వీడీసీల కారణంగా పోటీలో ఉండాలనుకున్న చాలా మంది ఔత్సాహికులు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.