వినాయక్‌నగర్, మార్చి 14: తన వ్యక్తిగత విషయాల్లో అడ్డువస్తున్నదని కన్నతల్లినే భర్తతో కలిసి ఓ కూతురు హతమార్చింది. మూర్చవ్యాధితో మృతి చెందినట్లు నమ్మించడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకా రం.. ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం,300 క్వార్టర్స్‌లో నివాసం ఉంటు న్న విజయలక్ష్మి(58) ఓ హోటల్లో పనిచేస్తున్నది. నాలుగేండ్లుగా ఆమె ఇంట్లోనే కూతురు సౌందర్య, అల్లుడు రమేశ్ ఉంటున్నారు. తనతోపాటు తన భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో తన తల్లి జోక్యం చేసుకుంటూ తలనొప్పిగా మారిందని కూతురు కక్ష పెంచుకున్నది.
ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన రాత్రి విజయలక్ష్మి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూతురు, అల్లుడు కలిసి ఆమె ముఖంపై తలదిండుపెట్టి, గొంతునొక్కి హత్య చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. తమ దర్యాప్తులో సౌందర్య, రమేశ్ నిందితులుగా తేలగా వారిపై ఎస్సై గంగాధర్ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, సిబ్బందిని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.