వినాయక నగర్ : నవమాసాలు మోసి, రక్తం పంచి జన్మనిచ్చిన కన్నతల్లిని భర్తతో కలసి అతి దారుణంగా హతమార్చింది ఓ కూతురు. తమకు అన్ని విషయాల్లో అడ్డుపడుతుందనే కోపంతో గొంతు నూలిమి హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందని తప్పుదోవ పట్టించేందుకు చేసిన యత్నాలను పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా కేంద్రం నార్త్ సర్కిల్ పరిధి 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో శుక్రవారం వెలుగు చూసిన వివరాలను నార్త్ సీఐ శ్రీనివాస్ ( CI Srinivas ) వెల్లడించారు.
నగరంలోని 300 క్వార్టర్స్ పరిధిలో నివాసముండే విజయలక్ష్మి (58) అనే మహిళకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. భర్త కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె స్వయంగా ఒక ఇల్లు కట్టించుకొని దాన్ని తన కూతురు సౌందర్య పేరున పట్టా చేయించింది. దీంతో కూతురు సౌందర్య , అల్లుడు రమేష్ ఇద్దరు కలిసి విజయలక్ష్మితో పాటు అదే ఇంట్లో కాపురం ఉంటున్నారు. విజయలక్ష్మి హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే, కూతురు , అల్లుడు మాత్రం ఎలాంటి పనులు చేయకుండా ఉండేవారని తెలిపారు.
కూతురు, అల్లుడికి అన్ని విషయాల్లో అడ్డు చెబుతుందన్న కోపంతో గురువారం రాత్రి ఇంట్లో విజయలక్ష్మి గొంతు నులిమి హత మార్చారు. ఈ విషయం బయటికి పోకుండా పక్షవాతం వచ్చి మరణించినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికుల ద్వారా శుక్రవారం విషయం తెలుసుకున్న నార్త్ సీఐ శ్రీనివాస్ , ఎస్సై గంగాధర్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలి గొంతుపై చేతివేళ్ల గుర్తులు ఉండడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లుగా నిర్దారించామని సీఐ వెల్లడించారు. కూతురు సౌందర్య అల్లుడు రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన వివరించారు.