ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 9: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. ఓడినందుకు అధైర్యపడవద్దని.. ముందున్న రోజులు మనవేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అధికారం పోయిందని… ఏదో కోల్పోయామని బాధపడవద్దని, మన రోజులు మనకు వస్తాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా కార్యాచరణ తయారుచేసుకుందామన్నారు. గ్రూప్ రాజకీయాలను వదిలి అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలను గెలిపించుకుంటే… మళ్లీ మనదే అధికారమని పేర్కొన్నారు.
కరోనా సమయం పోగా మిగిలిన కొద్ది సమయంలోనే నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్ మండలాల్లో ఎక్కడచూసినా అభివృద్ధి పనులను చేపట్టి మన మార్క్‌ను చూపించామని వివరించారు. నియోజకవర్గంలో చేసిన అభివృధ్ధిని ప్రజల వద్ద చెప్పుకోలేకపోయామని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన సర్వే రిపోర్టులో 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని మూడేండ్లలో చేశామని, అభివృద్ధిని ప్రజల వద్ద చెప్పుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్లు తెలిపారు. జెండామోసి, రాత్రనక, పగలనక తిరిగి రాత్రింబవళ్లు కష్టపడ్డ అభిమానులు, కార్యకర్తల ముఖాలు చూస్తే బాధగా ఉందన్నారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన వెంట ఉండి పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సమావేశంలో బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పీటీసీ ఉషాగౌడ్, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, ఆదిమూలం సతీశ్‌కుమార్, గాంధారి జడ్పీటీసీ శంకర్ నాయక్, గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీరావ్, నాయకులు నరహరి, అంజాగౌడ్, భూంగారి రాము, నాగం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.