రెంజల్, డిసెంబర్ 13: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ తండాలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో అతడి బంధువులు బాలిక ఇంటిపైకి దాడికి వెళ్లారు. దీంతో రోజంతా తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండాలో రెడ్యానాయక్ (50) కిరాణ షాపు నడిపిస్తున్నాడు. ఎనిమిదేండ్ల బాలిక గురువారం సాయంత్రం ఆయన దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, రెడ్యానాయక్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అయితే, అప్పటికే కోపోద్రిక్తులైన బాధితురాలి కుటుంబ సభ్యులు మూసి ఉన్న దుకాణంపై దాడి చేశారు. బయటికి వచ్చిన రెడ్యానాయక్పైనా కర్రలు, పారతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రుడ్ని జిల్లా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు.
ఈ విషయం తెలిసి మృతుడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటిపైకి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించగా వారించారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. ట్రైనీ ఎస్పీ ప్రశాంత్ కిశోర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్‌బాబు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.
తండాలో ఉన్న బెల్టు షాప్‌ను వెంటనే తొలగించాలని మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం మత్తులోనే ఇలాంటి సంఘటనలు, ఇండ్లల్లో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పోలీసులు వారించబోగా, వారితో వాగ్వాదానికి దిగారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. స్పందించిన ఏసీపీ.. బెల్టుషాప్ తొలగిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.