సదాశివనగర్, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, సన్నబియ్యంతో ప్రతి రోజూ మ ధ్యాహ్న భోజనం, డెస్క్ బెంచీలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో కార్పొరేట్‌ను తలదన్నేలా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎలాంటి ఫీజులు ఉండవని, ఉచిత విద్యతోపాటు సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం, ప్రతి శనివారం వెజ్బిర్యానీ అందిస్తున్న విషయాన్ని వివరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లకుండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ విద్యా సంవత్సరం సుమారు 120 మంది పిల్లలు చేరారు. బోధనకు సరిపడేంత టీచర్లు లేకపోవడంతో విద్యావలంటీర్ల నియామకానికి తల్లిదండ్రులే ముందుకొచ్చారు. సంఘంగా ఏర్పడి ప్రతినెలా రూ. 200 జమ చేస్తూ వీవీలకు జీతాలు చెల్లిస్తున్నారు. సర్కారు బడిని అభివృద్ధిచేసేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. ప్రతినెలా సమావేశమై విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులతో మాట్లాడుతారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా కృషి చేస్తున్నారు.
ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. దీంతో తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ప్రతి శనివారం వెజ్బిర్యానీ పెడుతున్నాం. ఉపాధ్యాయులు తక్కువగా ఉండడంతో తల్లిదండ్రులంతా కలిసి ప్రతి నెలా రూ.200 చొప్పున పోగు చేసి వీవీలను ఏర్పాటు చేశారు. తిర్మన్‌పల్లి నుంచి ఓ ఉపాధ్యాయురాలిని డిప్యుటేషన్‌పై పంపించారు.
– రాములు, హెచ్ఎం, హరిజనవాడ ప్రాథమిక పాఠశాల
ఇంటికాడ కూడా గరంగరం బిర్యానీ ఉండదు. మా బడిలో ప్రతి శనివారం మధ్యాహ్నం బిర్యానీ, టమాట కూర రుచిగా ఉంటుంది. కడుపునిండా తిని మంచిగా చదువుకుంటున్నాం. ఇంటి పక్కన పిల్లలను కూడా మాతో బడికి తీసుకెళ్తున్నాం. డ్రెస్సులు, పుస్తకాలు కూడా వట్టిగానే ఇచ్చిండ్రు.
– కార్తీక్, విద్యార్థి