నిజామాబాద్ క్రైం, జనవరి 29 : నిజామాబాద్ జిల్లాలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పల్లపు మల్లేశ్(40) కొంత కాలంగా కోర్టులో హాజరు కాకుండా, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మల్లేశ్‌పై కోర్టు ఎన్బీడబ్ల్యూ(నాన్ బెయిలెబుల్ వారెంట్)జారీ చేసింది. మల్లేశ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈక్రమంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ నరహరి ఆధ్వర్యంలో ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి.సాయినాథ్ తన సిబ్బందితో కలిసి మల్లేశ్ కోసం వేట ప్రారంభించారు. చివరకు మల్లేశ్‌ను ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. చాలా కాలంగా తప్పించుకొని తిరుగుతున్న నేరస్తుడిని పట్టుకున్న సీఐ నరహరి, ఐదో టౌన్ ఎస్సై సాయినాథ్తో పాటు సిబ్బందిని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ అభినందించారు.