నిజామాబాద్‌రూరల్/ధర్పల్లి/కోటగిరి/ మోస్రా(చందూర్)/శక్కర్‌నగర్/భీమ్‌గల్/ఆలూర్/ బోధన్‌రూరల్/ రెంజల్/ ఏర్గట్ల, జనవరి 18 :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నది. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ కోసం వైద్యాధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. శిబిరాల ఏర్పాట్లను అధికారులు బుధవారం పరిశీలించారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం, కొత్తపేటలో చేపట్టిన ఏర్పాట్లను తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో మల్లేశ్ బుధవారం పరిశీలించారు. కంటి వైద్యనిపుణురాలు అలేఖ్య, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీకార్యదర్శులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీవో మధురిమ, సర్పంచులు నగేశ్, లావణ్యాప్రవీణ్ గౌడ్, కార్యదర్శులు శ్వేత, సాయిబాబాగౌడ్, ఉపసర్పంచ్ సుదర్శన్, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా అందజేస్తారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని బీసీ వసతిగృహంలో, ప్రాజెక్టు రామడుగు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో, మోబిన్‌సాబ్ (కళాశాల తండా గ్రామపంచాయతీ) ఆవరణలో కంటివెలుగు శిబిరాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఎంపీడీవో నటరాజ్ తెలిపారు. శిబిరాలను జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, సర్పంచులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
కోటగిరి, పొతంగల్‌లో శిబిరాల ఏర్పాట్లను ఎంపీడీవో మారుతి పరిశీలించారు. కోటగిరి జీపీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు, పొతంగల్‌లోని రైతువేదికలో ఉదయం 10 గంటలకు శిబిరాలను ఎంపీపీ, జడ్పీటీసీ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సుప్రియ, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, హౌగీరావుపటేల్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, హెల్త్ సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో కంటివెలుగుకు సంబంధించిన కరపత్రాలను సర్పంచ్ పాశం సత్తెవ్వ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మారంపల్లి సుధాకర్, ఉపసర్పంచ్ రాజేందర్, ఏఎన్ఎం సాయికుమారి, రాధిక, వీడీసీ సభ్యులు గంగాధర్, బాలగంగారాం, కల్వరాల రఘుపతి, మాజీ ఎంపీటీసీలు గంగాధర్‌గౌడ్, వాచర్ మల్లయ్య, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
మోస్రా మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు.
వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి సూచించారు. బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి, అంబేద్కర్ కాలనీ, గంజ్‌లోని కంటి వెలుగు కేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ పరిశీలించారు. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి కంటి పరీక్షలు ప్రారంభించేందుకు ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించాలని చైర్పర్సన్ తూము పద్మావతి సూచించారు. కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులుంటే మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ శివకృష్ణ, మెప్మా టీఎంసీ అంగడి శ్రీనివాస్ ఉన్నారు.
గురువారం ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇమ్యూనైజేషన్ ప్రత్యేకాధికారి అశోక్ అన్నారు. భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్, ముచ్కూర్ గ్రామాలను, పట్టణ కేంద్రంలో మూడు కంటి వెలుగు శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరాలకు కావాల్సిన సౌకర్యాలను, ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మండల వైద్యాధికారి అజయ్ పవార్, డాక్టర్ అయేషాబేగం, తరుణ్, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ తరుణ్, మెప్మా సీసీ జలజ తదితరులున్నారు.గురువారం ప్రారంభం కానున్న కంటి వెలుగుపై ఆశ కార్యకర్తలతో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజలకు కంటి వెలుగు కరపత్రాలను అందజేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం అన్ని వార్డుల్లో కొనసాగుతుందని తెలిపారు.
ఆలూర్ మండలం దేగాంలో కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లను గురువారం ఆర్డీవో శ్రీనివాస్ పరిశీలించారు. శిబిరంలో నియమించిన సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఆలూర్ మండలంలోని దేగాం, మచ్చర్ల గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ పూజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బోధన్ మండలంలోని పెగడాపల్లి, సాలంపాడ్, సాలూర మండల కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమం గురువారం ప్రారంభించనున్నట్లు బోధన్ ఎంపీడీవో మధుకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే షకిల్ ఆదేశాల మేరకు బోధన్ ఎంపీపీ బుద్దెసావిత్రి రాజేశ్వర్, జడ్పీటీసీ గిర్దవర్ లక్ష్మీ గంగారెడ్డి శిబిరాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
కంటి వెలుగు -2 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రెంజల్ మండల వైద్యాధికారి వినయ్‌కుమార్ బుధవారం తెలిపారు. రెంజల్ మండలంలో 18 ఏండ్లు పైబడిన 23,432మందిని గుర్తించామని అన్నారు. మొదటగా రెంజల్ రైతు వేదిక భవనం, నీలా గ్రామ పంచాయతీలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
నీలా గ్రామంలో ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 16 వరకు, రెంజల్లో ఈనెల 19 నుంచి ఫిబ్రవరి 20 వరకు, బోర్గాంలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 1 వరకు, అంబేద్కర్‌నగర్‌లో ఫిబ్రవరి 21 నుంచి 22 వరకు, కిసాన్తండాలో ఫిబ్రవరి 27 నుంచి 28 వరకు, వీరన్నగుట్ట తండాలో మార్చి 1 నుంచి 2 వరకు, కళ్యాపూర్ గ్రామంలో మార్చి 2 నుంచి 13 వరకు, దండిగుట్టలో మార్చి 3 నుంచి 8వరకు, బాగేపల్లిలో మార్చి 9 నుంచి 13 వరకు, పేపర్‌మిల్‌లో మార్చి 14 నుంచి 23 వరకు, సాటాపూర్ గ్రామంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 10 వరకు, వీరన్నగుట్టలో మార్చి 24 నుంచి ఏప్రిల్ 4 వరకు, తాడ్‌బిలోలిలో ఏప్రిల్ 11 నుంచి 26 వరకు, దూపల్లిలో ఏప్రిల్ 27 నుంచి మే 16 వరకు, కందకుర్తిలో మే 17 నుంచి జూన్ 9వరకు, కునేపల్లిలో జూన్ 12 నుంచి 15 వరకు కేటాయించిన తేదీల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు.
ఏర్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నుంచి కంటి వెలుగు శిబిరం ప్రారంభించనున్నట్లు తహసీల్దార్ జనార్దన్, మండల వైద్యాధికారిణి ప్రసన్నప్రియ తెలిపారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు. సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్, ఎంపీడీవో కర్నె రాజేశ్, వైద్యులు మారుతి గౌడ్, పంచాయతీ కార్యదర్శి జాకీర్, వైద్య సిబ్బంది, అశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.