సంగారెడ్డి, జూన్ 3(నమస్తే తెలంగాణ) : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను నియోజకవర్గాల వారీగా లెక్కిస్తారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్ సోమవారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏడు నియోజకవర్గాలకుగాను ఏడు గదుల్లో 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. కనిష్ఠంగా 19 రౌండ్ల నుంచి గరిష్ఠంగా 23 రౌండ్ల వరకు ఓట్లు లెక్కించనున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 1973 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా 74.63 శాతం పోలింగ్ నమోదైంది. మొదట జుక్కల్, బాన్సువాడ ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి.జుక్కల్‌లో 255 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్లు, 19 రౌండ్లు ఓట్లు లెక్కించనున్నారు. బాన్సువాడలోని 258 పోలింగ్ కేంద్రాలకుగాను 14 టేబుళ్లలో 19 రౌండ్లు ఓట్లు లెక్కిస్తారు. ఎల్లారెడ్డిలోని 270 పోలింగ్ కేంద్రాలకు 14 కౌంటింగ్ టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. కామారెడ్డికి సంబంధించి 266 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లలో 19 రౌండ్లు ఓట్లు లెక్కించనున్నారు. నారాయణఖేడ్‌లోని 296 పోలింగ్ కేంద్రాలకు 14టేబుళ్లలో 22 రౌండ్లు, అందోల్‌లోని 313 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుళ్లలో 23రౌండ్లు, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు.