ఆర్మూర్ టౌన్, అక్టోబర్11: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన దగ్గర గన్ ఉందని, జాగ్రత్త అని హెచ్చరించారు. శుక్రవారం ఆర్మూర్‌లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే హల్చల్ చేశారు. అటు అధికారులు, ఇటు ఎంఐఎం నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలను అనుమతించిన పోలీసులు బీజేపీ నాయకులను లోపలికి రానివ్వలేదు. విషయం తెలుసుకున్న రాకేశ్‌రెడ్డి బయటికి వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ వారిని లోపలికి పంపించండి లేకపోతే కాంగ్రెస్ వారిని బయటికి పంపించాలని పోలీసులకు సూచించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ‘నా దగ్గర్ గన్ ఉంది జాగ్రత్త. వాళ్ల (కాంగ్రెస్ నేతల)తో చెప్పండి’ అని ఎమ్మెల్యే పోలీసులకు సూచించారు.
మరోవైపు, ప్రొటోకాల్ విషయంలోనూ కొద్దిసేపు గొడవ జరిగింది. ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్‌తో పాటు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఫొటోలు లేకపోవడంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. చివరకు కొత్త ఫ్లెక్సీ పెట్టడంతో వివాదం సద్దుమణిగింది.
అనంతరం ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు కలిసి చెక్కులు పంపిణీ చేశారు. అయితే, ఎంఐఎం కౌన్సిలర్ జాకీర్ వేదికపైకి వచ్చి.. షాదీ ముబారక్ చెక్కులు ఆలస్యంగా వస్తున్నాయని, అవి బౌన్స్ అవుతున్నాయని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. చెక్కులు బౌన్స్ అయితే నా దగ్గరకు వస్తే సమస్యను పరిష్కరిస్తా. కానీ అధికారుల చుట్టూ తిరిగితే ఏం లాభం జరుగుతుందని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కౌన్సిలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ మీ ఆటలు కొనసాగవు. ఆర్మూర్‌ను ఓల్డ్‌సిటీ చేస్తావా? అని మండిపడ్డారు. ఓల్డ్ సిటీగా మారుస్తానంటే ఊరుకునేది లేదంటూ చేతిలో ఉన్న మైక్‌ని కింద పడేశారు. అనంతరం వేదిక దిగి బయటికి నడిచారు.
అక్కడే ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను సముదాయించడంతో వేదికపైకి తిరిగి వచ్చారు. ‘ఏం డ్రామాలు చేస్తున్నారా..? నేను ఇక్కడి ఎమ్మెల్యే. ఐదేండ్లు నేనే ఉంటా. ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఏ పార్టీ నాయకులైనా తప్పు చేస్తే క్షమించేది లేదని’ రాకేశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. మరోవైపు, కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యను మాట్లాడనివ్వక పోవడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఎవరు తప్పుతున్నారో చూసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.