నిజామాబాద్, డిసెంబర్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చు రాజేసింది. ఓ వైపు బీసీలు, మరోవైపు మైనార్టీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సోమవారం జరిగిన డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల కార్యక్రమమే వేదికగా నిలిచింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో బహిర్గమైన ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. డీసీసీ పదవులను ఆశించి భంగపడిన వారంతా అధిష్టానం తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తే ఢోకా చేయడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. పైరవీలు చేసుకున్నోళ్లకే పదవులు ఇస్తారా? అంటూ మండిపడుతున్నారు.
మరోవైపు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోన్న అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజామాబాద్ జిల్లాలో పార్టీ పదవుల్లో మరోసారి అగ్రవర్ణాలకే పెద్ద పీట వేసింది. కొత్తగా నగర అధ్యక్షుడిని నియమించినప్పటికీ కీలకమైన డీసీసీ పదవిని తిరిగి అగ్రవర్ణాలకే కేటాయించడంపై బీసీలు మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్న మాటల ప్రకారం బీసీ నేతలకు న్యాయం జరుగుతుందని చాలా మంది ఆశించారు. కానీ అదేది జరగకపోవడంతో నిట్టూరుస్తున్నారు. గౌడ్, మున్నూరు కాపులు, పద్మశాలి, ముదిరాజ్ కులస్థులైతే బాహాటంగానే తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే భూపతి రెడ్డి డుమ్మా…
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన నగేష్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కడంతో స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆది నుంచి నగేశ్ రెడ్డికి డీసీసీ పదవి రాకుండా అడ్డుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తన నియోజకవర్గానికి డీసీసీ పదవి కేటాయిస్తే గౌడ సామాజిక వర్గానికి చెందిన శేఖర్ గౌడ్‌కు ఇవ్వాలంటూ భూపతి రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. ఏఐసీసీ, పీసీసీ నాయకత్వానికి ఇదే విషయాన్ని తెలియజేసినట్లుగా తెలుస్తోంది. కానీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే విన్నపాలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకున్నట్లుగా కనిపించకపోవడంతో నియోజకవర్గానికి చెందిన నేతలంతా నిట్టూరుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే డిసెంబర్ 1న జరిగిన డీసీసీ పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి భూపతి రెడ్డి హాజరు కాలేదని హస్తం నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో తీవ్ర దుమారం రేగుతోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలానికి చెందిన నగేశ్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కడంతో ఎమ్మెల్యేకు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానాన్ని నగేశ్ రెడ్డి ఆశించారు. ఇప్పుడు ఏకంగా పార్టీ జిల్లా సారథ్యం చేపట్టడంతో స్థానిక ఎమ్మెల్యే వర్గానికి మింగుడు పడటం లేదన్న వాదన కొనసాగుతోంది.
షబ్బీర్ అలీ రుసరుస.. బీసీలకు భంగపాటు..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సైతం రుసరుమంటున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంలో షబ్బీర్ మాట చెల్లుబాటు కాలేదు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతోన్న షబ్బీర్‌ను కాదని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డీసీసీ నియామకాలు జరగడంతో ఆయన వర్గం పెదవి విరుస్తోంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని తన కొడుకు ఇలియాస్‌కు ఇవ్వాలంటూ అధిష్టానానికి షబ్బీర్ అలీ దరఖాస్తు చేయగా భంగపాటు దక్కలేదు. మైనార్టీలో కోటాలో మంత్రి పదవి ఆశించగా నిరాశ మిగిలింది.
ఆఖరుకు తాను ప్రతిపాదించిన వ్యక్తులకు డీసీసీ పీఠం దక్కకపోవడంతో షబ్బీర్ అలీకి అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. ఉభయ జిల్లాలో మైనార్టీ నేతలకైనా పదవులు వస్తాయని షబ్బీర్ తలచగా అది కూడా నెరవేరలేదు. దీంతో నగేశ్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ వేదికపై అసంతృప్తి రాగాన్ని వినిపించనట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మైనార్టీ నేతలకు పదవులు ఇవ్వాలని, వారికి ప్రాధాన్యతను ఇస్తూ ప్రోత్సహించాలంటూ గట్టిగానే చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో డీసీసీ పదవుల పందెరం తీవ్ర దుమారం రేగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కేటాయించలేదు. డీసీసీ పదవి విషయంలో బీసీలకే అదృష్టం కలిసి వస్తుందని అంతా ఆశించగా మొండి చేయి మిగిలింది.