సారంగాపూర్, మార్చి 31: సిరికొండ మండలం చీమన్పల్లి పరిధిలోని జీనిగాల తండా చెరువు నుంచి కాంగ్రెస్ నేతలు అక్రమంగా నీళ్లు తరలించుకుపోయి, పంటలు పండించుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. దీంతో చెరువులో నీళ్లు లేక తమ పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని వాపోయారు. కాంగ్రెస్ నేతల నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జి జగన్కు విన్నవించారు. మంగళవారం నిజామాబాద్లో బాజిరెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
అధికార పార్టీకి చెందిన పది మంది మోటర్లు పెట్టి చెరువు నుంచి నీటిని తరలించుకు పోతున్నారని, దీంతో చెరువు ఖాళీ అవుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదని, 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. గతేడాది కూడా ఇలాగే అక్రమంగా నీటిని తరలించుకు పోతే, అటవీ శాఖకు ఫిర్యాదు చేయడంతో అధికారులు వచ్చి మోటర్లు తీసుకెళ్లారన్నారు. ఈసారి కూడా మోటర్ ఏర్పాటు చేసుకున్నారని, ఎమ్మెల్యే పేరు చెప్పుకుని నీటిని తరలించుకు పోతున్నారని తెలిపారు. నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని బాజిరెడ్డిని కోరారు. అనంతరం అటవీ శాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు బన్నీనాయక్, జవహర్లాల్నాయక్, కిషన్ నాయక్, రాములు నాయక్, గణేశ్, సంతోష్ తదితరులున్నారు.