మోర్తాడ్, ఆగస్టు 14: కమ్మర్పల్లి మండల మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయిలో ఉత్తమ సమాఖ్యగా ఎంపికైంది. రుణాల పంపిణీ, రికవరీ, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటు తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకుగాను ఈ అవార్డు లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 11వ స్త్రీనిధి వార్షిక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.. సమాఖ్య అధ్యక్షురాలు రోజారాణి, ఏపీఎం కుంట గంగాధర్‌కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
594 మండలాల్లో కమ్మర్పల్లి మొదటిస్థానంలో నిలవడం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. అలాగే రుణాల మంజూరు, రికవరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భీమ్‌గల్ స్త్రీనిధి మేనేజర్ సురేశ్‌కు ఉత్తమ మేనేజర్‌గా అవార్డు లభించింది. కలెక్టర్, డీఆర్డీవో, అధికారుల సూచనలు, ఐకేపీ సీసీలు, సిబ్బంది, సభ్యుల సమష్టి కృషితోనే అవార్డు దక్కిందని ఏపీఎం తెలిపారు.