మోర్తాడ్, డిసెంబర్ 21: డివైడర్ మధ్యలో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయని, నీళ్లు పోయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మండలంలోని సుంకెట్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా మోర్తాడ్‌లోని సెంట్రల్ లైటింగ్ డివైడర్‌లో పచ్చదనం, సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోవడాన్ని చూ శారు. వాటిని పరిశీలించి అక్కడే నిలబడి ఎంపీడీవో తిరుమలతో ఫోన్లో మాట్లాడారు. మొక్కలకు సరిగ్గా నీళ్లు పట్టని కారణంగా ఎండిపోతున్నాయని, ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు.
ఏడాదికాలంగా పచ్చగా ఉన్న మొక్కలు ఈ రెండుమూడు నెలల్లోనే ఎందుకు ఎండిపోతున్నాయన్నారు. మూడేండ్ల క్రితం నాటిన మొక్కలు మూడు నెలల క్రితం వరకు పచ్చగా ఉన్నాయని, అవి ఇప్పుడు ఎండిపోతున్నాయని, రోజూ నీళ్లు పట్టించి తిరిగి జీవం పోసుకునేలా చేయాలని సూచించారు. మళ్లీ తాను వచ్చే సరికి డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలు పచ్చగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, పాపాయి పవన్, యూసు ఫ్, ఏనుగు రాజేశ్వర్, తొగటి శ్రీనివాస్ ఉన్నారు.