డిచ్పల్లి, డిసెంబర్ 1 : తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినుల ఇబ్బందులు తీరనున్నాయి. యూజీసీ సూచన మేరకు వర్సిటీలో మరో గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూసా నిధులు రూ.7 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు మే నెలలో మంజూరయ్యాయి. అప్పట్లో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో టెండర్‌కు ఆటంకిగా మారింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ, కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పూర్తి కావడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వర్సిటీకి నూతన వైస్ చాన్స్‌లర్‌గా టి. యాదగిరిరావు బాధ్యతలు చేపట్టి సుమారు నెల కావొస్తున్నది.
యూనివర్సిటీలు, ఉన్నత విద్యా కళాశాలల్లో విద్యార్థినుల భద్రతపై నియమించిన యూజీసీ.. విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై 2002 నవంబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా గర్ల్స్ హాస్టళ్లను ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా నిర్మించాలని, క్యాంటీన్ మెస్ హాల్, పరిశుభ్రమైన టాయిలెట్లు, వాషింగ్మెషిన్లు, వైఫై సౌకర్యం, ఇండోర్ గేమ్స్, రీడింగ్ గదులు తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది.
విద్యార్థినులు ప్రవేశం పొందే సమయంలోనే హెల్ప్‌లైన్ నంబర్లు, స్టూడెంట్ కౌన్సిలర్లు, యాంటీ ర్యాగింగ్ సెల్, అత్యవసర వైద్యం, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్ తదితర పూర్తి వివరాలతో హ్యాండ్‌బుక్ ముద్రించి అందించాలని సూచించింది. బాలికల రక్షణకు అనుకూలమైన, సురక్షితమైన ప్రాంగణాలు తీర్చిదిద్దాలని కోరింది. విశ్వసనీయత ఉన్న సెక్యూరిటీ సంస్థల నుంచి తగినంత మహిళా భద్రతా సిబ్బందిని నియమించాలని పేర్కొంది. ఇలా మొత్తం 28 రకాల చర్యలు చేపట్టాలని యూజీసీ సూచించింది. యూజీసీ ఆదేశాల మేరకు ప్రస్తుతం వర్సిటీలో రెండో గర్ల్స్ హాస్టల్ నిర్మాణానికి మోక్షం లభించింది.
తెలంగాణ యూనివర్సిటీకి మహిళా హాస్టల్ భవనం మంజూరైంది. ఇందుకు రూసా నిధులు విడుదలయ్యాయి. వీసీ యాదగిరిరావు హాస్టల్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే హాస్టల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాం. హాస్టల్ నిర్మాణం పూర్తయితే విద్యార్థినులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
– యాదగిరి, టీయూ రిజిస్ట్రార్