ఎల్లారెడ్డి రూరల్, జూలై 7: వసతి గృహంలో పురుగుల భోజనం పెడుతున్నారంటూ ఎల్లారెడ్డి ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపాల్, వార్డెన్ తీరు ను నిరసిస్తూ నిజాంసాగర్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు. ఈ సం దర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు పురుగుల భోజనమే అందిస్తున్నారని, అన్నం, పప్పు, నీళ్లచారుతోపాటు ఆఖరికీ నీళ్లలోనూ పురుగులే దర్శనమిస్తున్నాయని వాపోయారు. రోజూ పురుగుల భోజనం తినలేక పస్తులు ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలను వార్డెన్‌తో పాటు మెస్ బాధ్యులు పట్టించుకోవడం లేదని మం డిపడ్డారు. అన్నంతో పాటు కూరలు, పప్పు ల్లో కూడా పురుగులు వస్తున్నాయన్నారు. చివరకు తమకు అందించే స్నాక్స్ ( పెసర్లు, బెబ్బర్లు లాంటివి)లో కూడా పురుగులే వస్తున్నాయని వాపోయారు. వాటిని తినడంతో తమకు ఎప్పుడు కడుపునొప్పి వస్తున్నద న్నారు.
సోమవారం ఉదయం అందించిన కిచిడీలో పురుగులు రావడంతో విద్యార్థులెవరూ తినలేదని తెలిపారు. సమస్యను చెప్పడానికి భయపడ్డామని, ఇక తప్పని పరిస్థితి రావడంతో రోడ్డెక్కినట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించే వరకూ కళాశాలకు వెళ్లబోమని భీష్మించుకు కూర్చున్నారు. తాము ఆం దోళన చేపట్టడంతో తమను ప్రిన్సిపాల్ టార్గెట్ చేస్తుందన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ అక్కడికి చేరుకొన్నారు. ఈ సందర్భం గా విద్యార్థినులు తహసీల్దార్‌తో తమ గోడు ను వెళ్లబోసుకున్నారు. విద్యార్థినుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తహసీల్దార్ నీళ్లు నమలాల్సి వచ్చింది. అనంతరం తహసీల్దార్ కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి, విద్యార్థినులతో కలిసి గురుకుల పాఠశాల తనిఖీకి వెళ్లారు. అంతలో అక్కడికి వచ్చిన అదనపు కలెక్టర్ విక్టర్ పాఠశాలలోని కిచెన్, స్టోర్, వాష్ రూం లను పరిశీలించారు. విద్యార్థినులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.