కామారెడ్డి, సెప్టెంబర్ 15 : కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.18 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌తోపాటు విద్యా వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు. ఇంతటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. విద్యా బోధన బాధ్యతలను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు అప్పగించాలని, అదనపు వేతనం చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని మండిపడ్డారు. వెంటనే కనీస వేతనం రూ.18 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మూడు నెలల పీఆర్సీ చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25న చలో సెక్రటేరియట్ చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా ఆయన లేక పోవడంతో ఆయన పీఏ గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబాయి లక్ష్మి, యాదమ్మ, సురేఖ, విజయ, సరిత, సుజాత, సునంద, సిద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.