హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎఫ్ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్స్‌కు దూసు కెళ్లింది. గచ్చిబౌలిలో బుధవారం రాత్రి భారత జట్టు.. 4-1తో వేల్స్‌పై ఘనవిజయం సాధించి పూల్-బీ నుంచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. నవ్‌నీత్ కౌర్ హ్యాట్రిక్ (29, 34, 55 నిమిషాల్లో) గోల్స్ చేసి భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలుపగా సాక్షి రాణా (7వ నిమిషంలో) ఒక గోల్ కొట్టింది.
వేల్స్ నుంచి థామస్ బెట్సన్ ఒక గోల్ చేసింది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సెమీస్ బెర్తును దక్కించుకునే అవకాశమున్న భారత్.. నాలుగు క్వార్టర్స్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి ఏకపక్ష విజయం సాధించింది. తొలి క్వార్టర్స్ ఏడో నిమిషంలోనే సాక్షి.. కెప్టెన్ సలీమ అందించిన బంతిని బలమైన రివర్స్ హిట్‌తో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపి తొలి గోల్‌ను అందించింది.
రెండో క్వార్టర్ నుంచి నవ్‌నీత్ మాయ మొదలైంది. పెనాల్టీ కార్నర్‌ను తొలి గోల్‌గా మలిచిన ఆమె.. మూడో క్వార్టర్లోనూ మరో గోల్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఆఖరి క్వార్టర్లో వేల్స్ గోల్ కొట్టి ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని తగ్గించినా 55వ నిమిషంలో నవ్‌నీత్ హ్యాట్రిక్‌తో భారత్ భారీ విజయం సాధించింది. సెమీస్‌లో భారత జట్టు శుక్రవారం.. ఇటలీతో తలపడనుంది.