బాన్సువాడ రూరల్, మార్చి 29 : ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన బాన్సువాడ మండలం నాగారంలో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. నాగారం గ్రామానికి చెందిన అమృతం కాశమణితో సోమేశ్వర్ గ్రామానికి చెందిన బింగి అలియాస్ అమృతం విఠల్ (38)తో ఇరవై ఏండ్ల క్రితం వివాహం జరిగింది.
అతను నాగారం గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. కాశమణి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, కుటుంబంలో గొడవలతో భార్యభర్తలు ఐదేండ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కాశమణి అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్‌తో వివాహేతర సం బంధం పెట్టుకుంది. ఈ విషయంపై గతంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.
మరోవైపు, తన వివాహేతర సంబంధాన్ని భర్త తరచూ ప్రశ్నిస్తుండడంతో కాశమణి అతడ్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన ప్రియుడు విఠల్, మరో వ్యక్తితో కలిసి భర్త గొంతు నులిమి, కొట్టి హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొల్లూర్ గ్రామ శివారులోని సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై మృతదేహాన్ని పడేశారు.
అయితే, తన తమ్ముడి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి సోదరుడు బింగి సాయిలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించిన పోలీసులు.. నిందితులైన కాశమణి, విఠల్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.