మాక్లూర్, మార్చి 8: మండలంలోని అమ్రాద్ తండాలో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. తండాలోని ముగ్గురు అన్నదమ్ములపై అదే తండాకు చెందిన ఓ వ్యక్తి రేషన్ బియ్యం విషయంలో కత్తితో దాడిచేశాడు. తండా నడిబొడ్డున పట్టపగలు జరిగిన ఈ ఘటనతో తండావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తండావాసులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలోని రేషన్ డీలర్ మా లోత్ సునీత శనివారం బియ్యం పంపిణీ చేస్తున్నది. తండాకు చెందిన భూక్య రమేశ్ అలియాస్ విక్రమ్, అతడి సోదరుడు పీర్సింగ్ కలిసి దుకాణానికి బియ్యం కోసం వచ్చారు.
అప్పటికే వారు ఈనెల తమ కోటాకు సంబంధించిన బియ్యం తీసుకున్నారు. అదనంగా మరో 50 కిలోల బియ్యం ఇవ్వాలని డీలర్ సునీతతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె తన భర్త జ్యోతిరాంనాయక్కు సమాచారాన్ని చేరవేసింది. జ్యోతిరాంనాయక్తోపాటు అతడి సోదరులు రాజునాయక్, శ్రీనివాస్ నాయక్ దుకాణం వద్దకు వచ్చారు. పీర్సింగ్తో పాటు వీరికి తీవ్ర వాగ్వాదం జరిగింది. వెంటనే రమేశ్ ఇంటికి వెళ్లికత్తితో వచ్చి అన్న పీర్సింగ్తో కలిసి డీలర్ భర్తతోపాటు అతడి సోదరులపై దాడిచేశాడు.
దీంతో ముగ్గురు అన్నదమ్ములకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. రాజునాయక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని స్థానికులు తెలిపారు. తండావాసులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో రమేశ్, పీర్సింగ్ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజశేఖర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డీలర్ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా తండాలో పోలీసు పికెట్ ఏర్పాటుచేశారు.