బోధన్, ఫిబ్రవరి 8: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న సర్కారు ప్రకటనలు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. అదే సమయంలో భయాలు సైతం వెంటాడుతున్నాయి. పునరుద్ధరణ నెపంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఫ్యాక్టరీ ఆస్తులపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరొందిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరణ కోసమని ఓ కమిటీ ఏర్పాటు చేసింది. నిజాం షుగర్స్ పునరుద్ధరణకు తగిన సలహాలు, సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది. అయితే, కాలయాపన చేయడానికే కమిటీ వేశారని ఇటు రైతాంగం, అటు కార్మికవర్గం భావిస్తున్నది. మరోవైపు, ప్రభుత్వం నేరుగా ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోకుండా మరోసారి ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచనలో ఉందన్న సమాచారం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంశం రాజకీయ శక్తుల జోక్యంతో సంక్లిష్టంగా మారుతుందన్న భయం కార్మికులు, కర్షకులను వెంటాడుతున్నది.
నాడు సభాసంఘం సిఫార్సులను అమలుచేయని కాంగ్రెస్ పాలకులు.. ఇప్పుడు మరోసారి నిజాం షుగర్స్ పునరుద్ధరణ పాట ఎత్తుకున్నారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ కోసం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్‌రావు, ఉన్నతాధికారులు సభ్యులుగా ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న ప్రజాప్రతినిధులంతా అప్పటి శాసనసభలో ఉన్నారు. నాడు సభా సంఘం నివేదికను బుట్ట దాఖలు చేసిన విధంగానే.. ఇప్పుడు మరో కమిటీ పేరిట కాలయాపన చేస్తారా? అన్న ఆందోళన సహజంగానే కార్మిక, కర్షకులను వెంటాడుతున్నది.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ పైవేటీకరణ పేరిట జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతామని, ప్రైవేట్ యాజమాన్యం నుంచి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై శాసనసభా సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆ సభాసంఘంలో ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం ఈ శాసన సభాసంఘాన్ని నియమించారు. సభాసంఘం 2006లో సమర్పించిన తన నివేదికలో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ అక్రమమని, ఇందుకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని, ఫ్యాక్టరీని ప్రభుత్వం బేషరుతుగా స్వాధీనం చేసుకోవాలని సిఫార్సులు చేసింది. అయితే, కాంగ్రెస్ పాలకులు పదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ప్రైవేట్ యాజమాన్యానికి వత్తాసుగా నిలబడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. 2002లో ఫ్యాక్టరీని తన అధీనంలోకి తీసుకున్న ప్రైవేట్ యాజమాన్యం రెండు, మూడేళ్లపాటు లాభాలను చూపించింది. ఆ తర్వాత వరుసగా నష్టాలు చూపిస్తూ… ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టింది., చివరికి 2015 డిసెంబర్లో లేఆఫ్ ప్రకటించటంతో నిజాం షుగర్స్ మూతపడింది.
కమిటీ ఏర్పాటు ఏమో కానీ మరో విష యం రైతులను భయాందోళనకు గురి చేస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఫ్యాక్టరీ పునరుద్ధరణ పేరిట ఆస్తులను సొంతం చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతున్నది. నిజాం షుగర్స్‌ను మరోసారి ప్రైవేటీకరణ చేయ డం, కొత్త యజమానులకు ఫ్యాక్టరీలను అప్పగించడం కోసమే రేవంత్‌రెడ్డి ప్రభు త్వం కమిటీ ఏర్పాటు నాటకానికి తెర తీసిందన్న చర్చ విస్తృతంగా సాగుతున్న ది. నిజాం షుగర్స్ యూనిట్లపై, ఆ ఫ్యాక్టరీ ఆస్తులపై కొంతమంది బడా కాంగ్రెస్ నేతలు కన్నేసినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరిగితే, విలువైన ఫ్యాక్టరీ భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చన్న కుట్రకు కొంతమంది అధికార పార్టీ నాయకులు తెర లేపినట్లు ప్రచారం జరుగుతున్నది. నిజాం షుగర్స్ ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులు, కార్మికులకు ఈ రాజకీయ జోక్యం, ఫ్యాక్టరీ ఆస్తులపై కొందరు కన్నేశారన్న వార్తలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఫ్యాక్టరీకి విశాలమైన భూములు, స్థలాలు, వ్యవసాయ భూము లు ఉన్నాయి. వందల కోట్ల విలువచేసే ఈ భూములపై కన్ను పడితే.. నిజాం షుగర్స్ పునరుద్ధరణ మాట ఎలా ఉన్నా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులపరమయ్యే అవకాశం లేకపోలేదు. అసలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పునర్ధురణపై సరైన ఎజెండాను రూపొందించకపోవడమే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నది.
నిజాం పాలనలో 1937లో బోధన్ కేంద్రంగా స్థాపించిన షుగర్ ఫ్యాక్టరీ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారంగా పేరొందింది. ఈ ఫ్యాక్టరీ లాభాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు చక్కెర కార్మాగారాలు, మూడు ఆల్కాహాల్ డిస్టిల్లరీలను, నాగార్జునసాగర్‌లో మెషినరీ యూనిట్‌ను ఏర్పాటుచేశారు. ఇటువంటి గొప్ప ప్రభుత్వరంగ సంస్థను నాటి సీమాంధ్ర పాలకులు తమ అరాచక విధానాలతో నష్టాల ఊబిలోకి నెట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పాలకులు పోటీపడి ఈ సంస్థను నాశనం చేశారు. చివరికి అప్పటి సీఎం చంద్రబాబు ఈ ఫ్యాక్టరీని జాయింట్ వెంచర్ పేరిట డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు అప్పగించాడు. నిజాం షుగర్స్ మూడు యూనిట్లను జాయింట్ వెంచర్ పేరిట కారుచౌకగా డెల్టా పేపర్ మిల్స్ యజమాని గోకరాజు గంగరాజు స్వాధీనం చేసుకున్నారు. నాడు బీఆర్ఎస్ ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయగా, కాంగ్రెస్ నాయకులు పట్టనట్టు వ్యవహరించారు. ఫలితంగా, 2002లో నిజాం షుగర్స్ యూనిట్లు శక్కర్‌నగర్ (బోధన్), ముత్యంపేట్ (మెట్పల్లి), ముంబాజీపల్లి (మెదక్) యూనిట్లు ప్రైవేట్పరమయ్యాయి.