ఖలీల్‌వాడి/ కామారెడ్డి, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని భావితరాలకు అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డ్ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంతకుముందు పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు , కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని అంశాలపై లోతైన ఆలోచనలు చేసి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగం ద్వారానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర రాజధానిలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించడం ద్వారా ఈ యేడాది అంబేద్కర్ జయంతికి మరింత ప్రత్యేకత చేకూర్చిందన్నారు. గొప్పగా లక్ష్యాలను నిర్దేంచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కీం కింద పాఠశాలల సంఖ్యను పెంచుతూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో ఉచితంగా ప్రవేశాలు లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని, ఆసక్తి, అర్హత కలిగిన వారికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ, ఆర్డీవో రవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, జిల్లా కార్మికశాఖ అధికారి యోహాన్, దళిత, బీసీ సంఘాల ప్రతినిధులు బంగారు సాయిలు, చెన్నయ్య, రాజేశ్వర్, శ్రీనివాస్, సంతోష్, విజయ్‌కుమార్, సుభాష్, జ్యోతిరాజ్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషిచేశారని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, ఆయన అడుగు జాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్,బీసీ బహుజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.