వినాయక్‌నగర్/ కామారెడ్డి, అక్టోబర్ 27 : ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ సోమవారం ముగిసింది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాధవనగర్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాలులో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సమక్షంలో లక్కీ డ్రా ద్వారా 102 మద్యం దుకాణాలను కేటాయించినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు. కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వారిలో 19 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. వైన్స్ షాపుల కేటాయింపు ప్రక్రియలోఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సీపీ సాయిచైతన్యతో పాటు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణమండపంలో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించారు. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగింది. జిల్లాలోని మొత్తం 49 వైన్ షాపులకు, 1502 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. లక్కీ డ్రా ద్వారా పురుషులకు 49, మహిళకు 12 మద్యం దుకాణాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్త మద్యం దుకాణాలకు డిసెంబర్ ఒకటి నుంచి 2027 నవంబర్ 30వరకు కాలపరిమితి ఉంటుందని తెలిపారు.