బాన్సువాడ రూరల్, ఆగస్టు 25 : పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని అన్నారు. గురువారం ఆయన బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 9లక్షలతో చేపట్టనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనం, రూ. 7.5 లక్షలతో అంగన్వాడీ కేంద్రంతో పాటు రూ. 5లక్షలతో చేపట్టనున్న ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సభాపతి మాట్లాడారు. సమైక్య పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదికి రూ. రెండు కోట్ల వరకు ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మౌలిక సదుపాయాల కింద బోర్లం గ్రామానికే రూ. 2 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనుల కింద దాదాపు రూ. 10 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపారని అన్నారు.
ప్రతి కుటుంబానికీ గూడు కల్పిస్తాం..
డబుల్బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపు 10వేల ఇండ్లను మంజూరు చేయించి గూడు లేని ప్రతిపేద కుటుంబానికీ గూడు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఇంటింటికీ తాగు నీరు, గుంట గుంటకూ సాగు నీరు అందించడమే తన లక్ష్యమన్నారు.
అశాంతిని సృష్టించేవారితో జాగ్రత్తగా ఉండాలి
కొందరు పని కట్టుకొని గ్రామాల్లోకి వచ్చి మైకుల్లో పనికి రాని మాటలు మాట్లాడి వెళ్లిపోతారని అన్నారు. తాము చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. ప్రజల మధ్య అశాంతిని సృష్టించే వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దళిత బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నారని అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకుంటుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు సరళ, శ్రావణి, ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, దళిత సంఘం నాయకులు సాయిలు, మన్నె విఠల్, నాగభూషణం, అనిల్, మన్నె సాయిలు, జే సాయిలు, గ్రామపెద్దలు కే శ్రీనివాస్‌రెడ్డి, నెర్రె నర్సింహులు, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, గోపన్‌పల్లి సాయిలు, పుట్టి లక్ష్మణ్, సయ్యద్ జలీల్, హైమద్, మహబూబ్, సులేమాన్, మమ్మాయి కాశీరాం, పుట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.