శక్కర్‌నగర్, జూలై 5: బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సమస్యలు పరిష్కరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. బోధన్ దవాఖానలో రోగులకు సరైన సౌకర్యాలు లేవన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలు రాలేదని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉన్నతాధికారులు స్పందించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేలా చూడాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్‌కు అందజేశారు. ధర్నాలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకుడు సుధాకర్, అవుట్ సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు.