మోర్తాడ్, నవంబర్ 28 : వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్రప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, వారికి ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల డిమండ్లు, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్‌లో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్ సుజాతకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఏడాదంతా పనిలేక వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రూ.12 వేల జీవనభృతి ఇవ్వాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మికసంఘం నాయకులు కిషన్, సారా సురేశ్, సత్తెమ్మ, అశోక్, దామోదర్, దయాళ్‌సింగ్, పోశెట్టి, నాని, అంజలి, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు.