Telangana University | కంటేశ్వర్ నవంబర్ 10 : టీయూ 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘిస్తూ అక్రమంగా నియామకమైన వారిని పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు తీర్పు కాఫీ అందలేదని సాకుతో వాళ్లను యథేచ్ఛగా కొనసాగిస్తూ అక్రమార్కులకు అండగా ఉంటున్న ప్రస్తుత వీసీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012 సంవత్సరంలో నాటి వీసీ రిజిస్టర్, ఎలాంటి నియమ, నిబంధనలు పాటించకుండా దొడ్డి దారిన తమకు నచ్చిన వ్యక్తులకు నియమకాలు కల్పించారని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, రాష్ట్ర హైకోర్టు సుదీర్ఘంగా విచారించి ఈ నియామకాలు అక్రమంగా జరిగినవన్నీ తేల్చి వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రస్తుత వీసీ వారి పై వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్లకు యథావిధంగా ఆ స్థానాల్లో కొనసాగిస్తున్నాని మండిపడ్డారు.
యథావిధంగా జీతభత్యాలు చెల్లించడం కోర్టు ధిక్కరణ అవుతుందని, దీని ప్రకారం ప్రస్తుత వీసీ, యూనివర్సిటీ అధికారుల అండదండలతోనే ఇలాంటి అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నాయని స్పష్టం అవుతుందని ఆరోపించారు. అవినీతికి అడ్డగా తెలంగాణ యూనివర్సిటీ మారిందని, అధికారులు ఎడాపెడా అక్రమార్జన ధ్యేయంగా పనిచేస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడాలని ఒక మంచి ధృక్పథం తో నాటి విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా తెలంగాణ పేరుతో యూనివర్సిటీ తీసుకొస్తే, ఆది నుంచి అధికారుల అవినీతి కారణంగా యూనివర్సిటీ అభివృద్ధి చెందకుండా అక్రమార్కులకే అడ్డగా మారడం శోచనీయమన్నారు.
కావున అవినీతి అధికారులకు అండదండలు అందిస్తున్న యూనివర్సిటీ అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి, దుర్వినియోగమైన కోట్ల రూపాయలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. వీటికి కారణమైన వారిని పూర్తిగా సర్వీసు నుంచి రిమూవ్ చేసి వారిని జైలుకు పంపాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డీ నాగరాజు, జవారి రాహుల్, ఆర్ రాజన్న, బీ రవీందర్ గౌడ్, జే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.