శక్కర్‌నగర్, ఫిబ్రవరి 28: రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్..వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది. గతేడాది భారీ వర్షాలకు గోదావరి, మంజీరా పరీవాహక ప్రాంతాలతోపాటు ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ కారణంగా బోధన్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారులతో ఆదరబాదరగా పంట నష్టంపై సర్వే చేయించింది. నియోజకవర్గంలో పంట నష్టం, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వ్యవసాయశాఖ అధికారుల ద్వారా అంచనా వేయించింది. పంట నష్టం జరిగి సుమారు ఆరు నెలల కాలం పూర్తి కావస్తున్నా.. ఇప్పటివరకూ పరిహారం ఊసేలేదు.
పరిహారం అందించడంలో ప్రభుత్వం పరిహాసం చేస్తున్నదని రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వందల ఎకరాలు నీట మునిగి, పూర్తిగా పంట నష్టం జరిగినా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని ఆశిస్తున్న రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. బోధన్, సాలూరా, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాలకు చెందిన 21,763 మంది రైతులకు చెందిన 24,038 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. నష్ట పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఇంతవరకూ దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాట్లు వేసే సమయానికి రైతుబంధు డబ్బులు వచ్చేవని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా సకాలంలో, సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపారు. పంటనష్ట పరిహారంపై వ్యవసాయశాఖ అధికారులను అడిగినా, వారు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కోరుతున్నారు.
బోధన్ మండలంలోని బిక్నెల్లి, హంగర్గ, కొప్పర్గ, సిద్దాపూర్ గ్రామ శివారు, సాలూరా మండలంలోని హున్సా, మందర్నా, ఖండ్గాంల శివారు, రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి, బోర్గాం, తాడ్‌బిలోలి, నవీపేట్ మండలంలోని కోస్లీ, యంచ, బినోల, నాళేశ్వర్ గ్రామాల్లో వరి, సోయాబీన్‌తో పాటు పలు అంతర పంటలు నీటి మునిగిపోయాయి. ఎడపల్లి మండలం జైతాపూర్ శివారులోని చిన్న రైతులకు చెందిన 51 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగినట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. వానకాలం పంట కాలం పూర్తయి, యాసంగి పంట కూడా త్వరలో చేతికి రానుండగా, ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం అందించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గతేడాది భారీ వర్షాలకు సుమారు 11 ఎకరాల్లో సోయా పంట చేతికందకుండా పోయింది. రైతుకు కౌలు కింద ఎకరాకు రూ. 25వేలు చెల్లించిన. దీంతో పాటు అదనంగా పంట కోసం ఎకరాకు రూ.25వేలు ఖర్చుచేసిన. ఎకరాకు కౌలుతో పాటు పెట్టిన పెట్టుబడి కలిపి మొత్తం పంటలు నీట మునిగిపోయి, సుమారు రూ. 6లక్షలు నష్టం జరిగింది. పంట నష్టానికి ప్రభుత్వం ఎంతోకొంత సాయం చేస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నా.. ఇప్పటివరకూ ఎలాంటి సాయం అందలేదు. అందుతుందనే భరోసా కూడా కనిపించడం లేదు..
– పుట్టి నడిపి నాగన్న, బోర్గాం, రైతు
నాకున్న 25 ఎకరాల సోయాపంట పూర్తిగా నీట మునిగి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వరదల పరిస్థితి గుర్తించి పంటలకు నష్టపరిహారం అందిస్తామ ని చెప్పినా, అది నేటి వరకు అందలేదు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులు, స్థానిక అధికారులతో కలిసి సర్వేలు జరిపారు. ఎంతోకొంత పరిహారం అందుతుందని ఆశిస్తున్నా.. అది నేటి వరకు అందకపోవడంతో అడియాసగానే మారుతున్నది. నిత్యం పరిహారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులను కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. రైతులను ఆదుకోవా ల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
– ఎస్. గంగాధర్, రైతు, హంగర్గా, బోధన్ మండలం