ఎడపల్లి, జూన్ 25: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ దవాఖానలను సీఎం కేసీఆర్ ఆధునీకరించారు. గతంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానకు వెళ్లడానికి ముఖం చాటేసేవారు. ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలతో, ఆధునిక యంత్ర పరికారాలతో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దారు. దీంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. గతంలో ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజూ 60 పైగా ఓపీ పేషెంట్లు వచ్చేవారు.
ప్రస్తుతం ఆసంఖ్య 150 పైనే నమోదు అవుతున్నది. నెలకు 2 నుంచి 3 ప్రసవాలు చేస్తున్నారు. మండలంలోని ఒడ్డపల్లి, మంగళ్పాడ్, ఏఆర్పీ, కుర్నాపల్లి నుంచి ప్రసవాల కోసం గర్భిణులు ఎక్కువగా వస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో నార్మల్ డెలివరీల కోసం వైద్య సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నారు. కొన్ని కేసులు క్లిష్టమైన సమయంలో తప్పనిసరి ఆపరేషన్ కోసం బోధన్ ప్రభుత్వ దవాఖానకు సిఫార్సు చేస్తున్నారు.
జ్వరాలు, కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, నడుము నొప్పితో రోగులు ఎక్కువగా వస్తున్నారు. గర్భిణుల విషయంలో వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రతి నెలా వారికి పరీక్షలు చేస్తూ తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను వివరిస్తున్నారు. వ్యాయామం చేయిస్తూ నార్మల్ డెలవరీలు అయ్యేలా కృషి చేస్తున్నారు.
ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ కేసుల సంఖ్య ప్రస్తుతం రోజూ 150 నుంచి 180 వరకు ఉంటున్నది. రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందిస్తున్నాము. కుక్క కాటు, పాము కాటుకు కూడా వైద్య సేవలు అందిస్తున్నాం. గర్భిణుల ప్రసవాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. నార్మల్ డెలివరీలు చేసేందుకు కృషి చేస్తున్నాం.
– వినీత్ రెడ్డి, వైద్యాధికారి
నాకు జ్వరం, దగ్గు వంటి ఏసమస్య వచ్చినా సర్కారు దవాఖానకే వెళ్తాను. ఇందులో డాక్టర్లు మంచిగ చూస్తరు. మందులు ఇస్తరు. ప్రైవేటు దవాఖానకు వెళ్తే డాక్టర్ ఫీజు, మందులు కలుపుకుని సుమారు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు అయ్యేది. ప్రభుత్వ దవాఖానలో అన్నీ ఫ్రీగా ఇస్తున్నరు. మందులకు లోటు లేదు. రోగం త్వరగా నయం అయ్యేలా సిబ్బంది శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంత మంచి పనులు చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. – పార్వతమ్మ, ఓడ్డపల్లి