బాన్సువాడ, ఏప్రిల్ 7: బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్తతకు గురి కావడం కలకలం రేపింది. 50 మంది దవాఖానలో చేరడంతో కల్తీ కల్లు ఉదంతం మరోమారు చర్చనీయాంశమైంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ క్యాంపు, దుర్కితో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆయా గ్రామాలకు చెందిన 50 మంది కల్లు తాగి అస్వస్తతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన బాన్సువాడ దవాఖానకు తరలించారు. అందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి పరామర్శించారు. డీఎంహెచ్‌వోకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
బాన్సువాడ దవాఖానలో ఆర్ఎంవో అందుబాటులో లేకపోవడంపై సబ్ కలెక్టర్ కిరణ్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎంవోకు ఫోన్ చేసిన ఆమె.. దవాఖానా రెస్పాన్స్ మీదే కదా.. మీరే లేకపోతే ఎలా? అని నిలదీశారు. సిబ్బంది కూడా అందుబాటులోకి రాకపోవడంపై మండిపడిన ఆమె.. ఇది కరెక్ట్ పద్ధతి కాదన్నారు. వెంటనే దవాఖానకు రావాలని ఆర్‌ఎంవోను ఆదేశించారు. మరోవైపు, కల్తీ కల్లు తయారు చేసి, విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతున్న కల్తీ కల్లు దందాపై నమస్తే తెలంగాణ ఈ నెల 2వ తేదీన ప్రత్యేక కథనం ప్రచురించింది. అధికార పార్టీ నేతల అండదండలు, ఎక్సైజ్ సిబ్బంది ఉదాసీనతతో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్న తీరును స్పష్టంగా వివరించింది. ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో జోగుతున్న వైనాన్ని ఎత్తిచూపింది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే అమాయకులు ఇలా దవాఖాన పాలయ్యే పరిస్థితి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.