ఖలీల్వాడి, మే 8 : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు త్వరలో నిర్వహించనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో జిల్లా ఇంటర్ విద్యాధికారి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ ..ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల ప్రణాళిక ద్వారా వంద శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ హాస్టళ్లలో కనీసం 20 శాతం సీట్లను కేటాయించాలని కోరారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, మాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపితే అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.